ODI WC 2023: మన పిచ్‌లు సూపర్.. ప్రపంచకప్‌లో సమతూకపు వికెట్లపై ప్రశంసలు

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే తొలి సెమీస్‌ ముగిసింది. టీమ్‌ఇండియా విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. భారత్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పిచ్‌లు అద్భుతంగా రూపొందించారని మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published : 16 Nov 2023 13:13 IST

భారత్‌ వేదికగా ప్రపంచకప్ (ODI World Cup 2023) అనగానే.. పిచ్‌లన్నీ స్పిన్నర్లకు దాసోహం అంటాయని.. వాళ్లదే ఆధిపత్యం అని.. టీమ్‌ ఇండియా తనకు అనుకూలంగా వికెట్లు తయారు చేయించుకుని ప్రత్యర్థులను దెబ్బ కొడుతుందని అంచనా వేశారు. కానీ, ఆశ్చర్యంగా ఈ ప్రపంచకప్‌లో స్పిన్నర్ల కంటే పేసర్లే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చారు. స్పిన్నర్ల ప్రభావం లేదని కాదు కానీ.. పేసర్లు భారత్‌లో ఇంత ప్రభావం చూపడమే ఆశ్చర్యం. మరోవైపు టోర్నీలో భారీ స్కోర్లూ నమోదయ్యాయి. అలా అని పిచ్‌లు ఏకపక్షంగా బ్యాటర్లకు అనుకూలించలేదు. బౌలర్లకూ బాగా సహకరించాయి. బ్యాటుకు, బంతికి మధ్య ఆసక్తికర పోరు సాగుతుండటంతో ప్రపంచకప్‌ కోసం సమతూకపు పిచ్‌లను తయారు చేశారనే ప్రశంసలు దక్కుతున్నాయి.

‘‘ఈ ప్రపంచకప్‌లో బ్యాటర్లు చెలరేగారు. బౌలర్లూ విజృంభించారు. పేసర్లు ప్రభావం చూపారు. స్పిన్నర్లూ ఆకట్టుకున్నారు. ఎవరికి ఏం కావాలో అవి ఇచ్చాయి వికెట్లు. అత్యంత సమతూకంతో ఉన్న పిచ్‌లను ఈ ప్రపంచకప్‌లో చూశాం’’.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసిర్ హుస్సేన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. భారత పిచ్‌లు అంటే జీవం ఉండదని.. బ్యాటర్లదే ఆధిపత్యం అని.. బౌలింగ్‌లో స్పిన్నర్లకు తప్ప పేసర్లకు అవకాశం ఉండదని.. ఇలాంటి అభిప్రాయాలుండేవి ఒకప్పుడు. అయితే, గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. మన పేస్ బలం కూడా పెరగడం, విదేశీ పరిస్థితుల్లో సీమ్‌ అనుకూలించే పరిస్థితుల్లో మన బౌలర్లు రాణించాలంటే దేశీయ పిచ్‌లు కూడా వారికి సహకరించాల్సిన అవసరాన్ని గుర్తించి అందుకు తగ్గ వికెట్లు సిద్ధం చేస్తున్నారు. 

టెస్టుల్లో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువే అయినా.. పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రం సమతూకం ఉన్న పిచ్‌లనే తయారు చేస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో పిచ్‌ల బాధ్యత మొత్తం ఐసీసీనే చూసుకుంటుందన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఏకపక్షంగా పిచ్‌లు ఉండకపోయినా.. కొంతమేర ఆ జట్ల బలానికి తగ్గట్లు వికెట్లు ఉండేలా సిద్ధం చేస్తుంటారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ బలం ఎలాంటిదో తెలిసిందే కాబట్టి ఐసీసీ క్యురేటర్లను భారత్ ప్రభావితం చేస్తుందని.. పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు అంచనా వేశారు. కానీ టోర్నీలో ఏ వేదికలోనూ పిచ్‌లు అలా ఏకపక్షంగా స్పిన్నర్లకు అనుకూలించేలా లేవు. ఇంకా చెప్పాలంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపారు. పరిస్థితులు, పిచ్‌లను మిగతా జట్ల పేసర్ల కంటే మన వాళ్లే ఎక్కువ ఉపయోగించుకోవడం విశేషం.

అదే స్పెషాలిటీ

ఈసారి ప్రపంచకప్‌లో పిచ్‌లు ఎంత సమతూకంతో ఉన్నాయో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ముంబయిలో శ్రీలంకతో మ్యాచ్‌లో మొదట భారత్ 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. కానీ అదే పిచ్ మీద తర్వాత మన పేసర్లు ఎలా విజృంభించారో తెలిసిందే. శ్రీలంక కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ జరుగుతోంది వాంఖడేలోనా లేక ఏ గబ్బాలోనా అని ఆశ్చర్యపోయారు అందరూ. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం అయితే రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు కూడా పెద్ద స్కోర్ చేసి ఉండాలి. అలా జరగలేదు. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్లకు ఏకంగా 399 పరుగులు చేసింది. కానీ తర్వాత ఇంగ్లాండ్ 170కే కుప్పకూలింది. 

టోర్నీలో ఏ వేదికలోనూ ఏకపక్షంగా బ్యాటర్లకు పిచ్‌లు సహకరించలేదు. అన్ని చోట్లా భారీ స్కోర్లు నమోదయ్యాయి. అదే సమయంలో తక్కువ స్కోర్లకూ జట్లు ఆలౌట్ అయ్యాయి. టోర్నీలో మూడుసార్లు జట్లు 400కు పైగా స్కోర్లు సాధిస్తే.. మూడుసార్లు వంద లోపు స్కోర్లకు జట్లు ఆలౌట్ కావడం ఈ టోర్నీ విశిష్టతకు నిదర్శనం. అలా అని బ్యాటింగ్ మరీ కష్టంగా, పూర్తిగా బౌలర్లకు అనుకూలించేలా కూడా వికెట్లు లేవు. బ్యాటుకు, బంతికి మధ్య ఆసక్తికర పోరు జరిగేలా పిచ్‌లు సమతూకంగా ఉన్నాయి. టోర్నీలో స్పిన్నర్ల కన్నా పేసర్లు ఎక్కువ వికెట్లు పడగొట్టడం చూశాక.. ఉపఖండం అంటే స్పిన్నర్లదే ఆధిపత్యం అనే అభిప్రాయాన్ని ఇప్పుడు మార్చుకోవాల్సిందే. అందుకే పిచ్‌ల నాణ్యత, సమతూకం పరంగా ఇది ఉత్తమ ప్రపంచకప్‌ల్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని