R Ashwin: పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా వ్యాఖ్యలపై అశ్విన్‌ కౌంటర్‌

తమను ఓడించగలదని భావిస్తుంది కాబట్టే భారత జట్టు పాకిస్థాన్‌ను గౌరవిస్తోందంటూ రమీజ్‌ రజా చేసిన వ్యాఖ్యలపై రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు.

Published : 11 Oct 2022 01:22 IST

దిల్లీ: తమను ఓడించగలదని భావిస్తుంది కాబట్టే భారత జట్టు పాకిస్థాన్‌ను గౌరవిస్తోందంటూ పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రజా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. గెలుపోటముల ఆధారంగా ప్రత్యర్థిని గౌరవించడం అనేది ఉండదని, అది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయమంటూ కౌంటర్‌ ఇచ్చాడు. 

‘‘ఇది క్రికెట్‌. రెండు దేశాల మధ్య పోరు ప్రజలకు ఎంతో కీలకమైంది. ప్రత్యర్థిని గౌరవించడం అనేది మనం ఎలాంటి వారమన్న దానిపై ఆధారపడి ఉంటుంది.  వారు మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి మేం కచ్చితంగా పాక్‌ను గౌరవిస్తాం. రాజకీయ ఒత్తిడులు, జట్ల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా పోటీ చాలా పెద్దది. ఒక క్రికెటర్‌గా, క్రీడాకారుడిగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. గెలుపోటములు ఆటలో భాగమని తెలుసుకోవాలి. జయాపజయాలు స్వల్ప తేడాతోనే ఉంటాయని గుర్తించాలి ’’అని అశ్విన్‌ పేర్కొన్నాడు. 

‘‘ఇదివరకు భారత్‌తో తలపడితే పాక్‌ జట్టును చాలా మంది చిన్న చూపు చేసేవారు. గత కొంత కాలంగా మేం నమోదు చేస్తున్న విజయాలు చూసి టీమ్‌ఇండియా లాంటి బలమైన ప్రత్యర్థి సైతం మమ్మల్ని గౌరవించడం మొదలుపెట్టింది. ఎందుకంటే పాక్‌ తమను ఓడించగలదని వారు భావిస్తున్నారు’’ అంటూ రమీజ్‌ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆసియా కప్‌లో భారత్‌పై పాక్‌ నెగ్గిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని