Rahane: రహానె స్పెషల్‌ కేటగిరీ ఆటగాడు: వసీమ్‌ జాఫర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) ఆసీస్‌ చేతిలో భారత్‌ పరాజయంపాలైనప్పటికీ.. మిడిలార్డర్‌ బ్యాటర్ అజింక్య రహానె ఆట మాత్రం అభిమానులకు గుర్తుండిపోతుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన పరుగులు సాధించాడు.

Published : 13 Jun 2023 19:33 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో అత్యంత సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడిన టీమ్‌ఇండియా ప్లేయర్‌ ఎవరైనా ఉన్నారంటే అది అజింక్య రహానె.  తొలి ఇన్నింగ్స్‌లో 89, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున దూకుడైన ఆటతీరును ప్రదర్శించి వచ్చిన రహానె.. టెస్టు ఫార్మాట్‌లోకి అలవోకగా పరకాయ ప్రవేశం చేసేశాడు. ఓ పక్క టాప్‌ ఆర్డర్‌ అంతా త్వరగా పెవిలియన్‌కు చేరితే రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలో రహానెపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన రహానె జట్టుకు వెన్నెముకగా నిలిచాడని పేర్కొన్నాడు. ఇకనుంచి రహానె నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తాడనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు. 

‘‘రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రహానె ఆడిన తీరు అద్భుతం. ఒత్తిడిని అధిగమించి పరుగులు చేయడం బాగుంది. భారీ లక్ష్య ఛేదనలోనూ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడేందుకు ప్రయత్నించాడు. దూకుడుగా సానుకూలతతో క్రికెట్ ఆడుతుంటే ప్రత్యేకమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు.  ఇలాగే నిలకడగా ఆడతాడని ఆశిస్తున్నా’’ అని జాఫర్‌ తెలిపాడు. 

అన్ని విభాగాల్లో ఆసీస్‌దే ఆధిక్యం: కీర్తి అజాద్

‘‘ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో మనల్ని ఓడించింది. వారి బౌలింగ్‌, బ్యాటింగ్ సరిగ్గా ఉన్నాయి. మన బ్యాటింగ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌తో బౌలింగ్‌ సంధించారు. వారు వికెట్లు తీయని సందర్భంలోనూ అదే లెంగ్త్‌కు కట్టుబడి ఉన్నారు. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లోనే మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇక మన బౌలింగ్‌ మొదటి ఇన్నింగ్స్‌ కంటే రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా ఉంది. ఒకవేళ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 325 లోపే కట్టడి చేసి ఉంటే తప్పకుండా ఫలితం మనకు అనుకూలంగా వచ్చేది. మనకు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ.. అనవసరంగా వికెట్లను చేజార్చుకుని ఓటమిపాలైంది’’ అని మాజీ క్రికెటర్‌ కీర్తి అజాద్‌ అన్నాడు. 

రోహిత్ సూచనకు మద్దతిస్తా: బ్రాడ్ హాగ్

‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కోసం మూడు టెస్టులను నిర్వహించాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూచనకు మద్దతు ఇస్తున్నా. అయితే ఈసారి కేవలం ఒక్క మ్యాచ్‌తోనే ఫలితం వచ్చేసింది. దీనిని మనం చేయలేం. ఆసీస్‌ విజేతగా నిలిచింది. ఇక భవిష్యత్తులో మాత్రం మూడు టెస్టుల సిరీస్‌ పెడితే బాగుంటుంది. అంతేకాకుండా, ఎనిమిది జట్లను రెండు డివిజన్లుగా చేసి నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది. టాప్‌ -4 ఒక గ్రూప్‌గా.. మరో నాలుగు రెండో గ్రూప్‌గా చేయాలి. అసోసియేట్‌ దేశాలను మరొక డివిజన్‌గా చేసి ఆడించాలి. ఆయా డివిజన్లలో టాపర్లుగా నిలిచిన జట్లు వారి సొంత మైదానంలో మూడు టెస్టుల సిరీస్‌ను ఆడితే బాగుంటుంది’’ అని ఆసీస్‌ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని