Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్

వరల్డ్ కప్‌ (ODI World Cup 2023) జట్టులో మార్పులు ఏ విధంగా ఉంటాయనే ప్రశ్నలు వస్తున్నా తాను స్పందించకూడదని.. అధికారికంగా మేనేజ్‌మెంట్ వెల్లడిస్తుందని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. 

Updated : 28 Sep 2023 12:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచకప్‌ బరిలోకి దిగే ముందు ఇంగ్లాండ్‌తో సెప్టెంబర్ 30న భారత్‌ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు ఇవాళే తుది స్క్వాడ్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎవరు ఉంటారు? అనే విషయాలను తాను ధ్రువీకరించకూడదని, అదంతా మేనేజ్‌మెంట్ చూసుకుంటుందని పేర్కొన్నాడు. అశ్విన్‌ లేదా మరొకరినైనా ఎంపిక చేస్తే సెలెక్షన్ కమిటీ అధికారికంగా వెల్లడిస్తుందని స్పష్టం చేశాడు. 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ద్రవిడ్ మాట్లాడాడు. ‘‘భారత ఆటగాళ్లంతా కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చారు. వారంతా ప్రతిభావంతులే. బుమ్రా, సిరాజ్‌, అశ్విన్, కేఎల్, శ్రేయస్‌.. ఇలా ప్రతి ఒక్కరూ తమ విభాగాల్లో రాణించారు. వన్డేల్లో ఫామ్‌తో ఇబ్బంది పడిన సూర్యకుమార్‌ కూడా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇదే ఊపును వరల్డ్‌ కప్‌లోనూ కొనసాగిస్తారని భావిస్తున్నా. అన్ని రంగాల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలి’’ అని వెల్లడించాడు.

అక్షర్ ఉంటాడా?

‘‘తుది జట్టు కోసం మేమంతా వేచి ఉన్నాం. అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీతో చీఫ్‌ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బృందం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. దీనిపై నేను ఎలాంటి కామెంట్లు చేయకూడదు. ఎలాంటి మార్పు ఉన్నా మేనేజ్‌మెంట్ అధికారికంగా వెల్లడిస్తుంది. ఇప్పటి వరకైతే ఎలాంటి మార్పులు లేవు’’ అని ద్రవిడ్ తెలిపాడు. దీంతో అక్షర్‌ పటేల్ 15 మందితో కూడిన స్క్వాడ్‌లో ఉండొచ్చనే సూచనలు ఇచ్చినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గువాహటికి పూర్తిస్థాయి జట్టు వస్తుందని, వరల్డ్ కప్‌ సన్నాహాలు ప్రారంభమవుతాయని ద్రవిడ్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని