IND vs SL : ఆసియా కప్‌ ఫైనల్‌ సమరం.. వరుణుడి సహకారం ఎలా ఉండనుందంటే?

భారత్ - శ్రీలంక (IND vs SL) జట్ల మధ్య ఆసియా  కప్‌ ఫైనల్‌కు వేదిక కొలంబోలోని ప్రేమదాస స్టేడియం. కానీ, వాతావరణ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. రిజర్వ్‌ డే ఉన్నప్పటికీ.. ఇవాళ పూర్తిస్థాయి మ్యాచ్‌ జరిగితే బాగుంటుందనేది అభిమానుల కోరిక.

Updated : 17 Sep 2023 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మినీ టోర్నీ విజేతగా నిలిచేందుకు భారత్ - శ్రీలంక (IND vs SL) జట్లు తమ శక్తియుక్తులతో సిద్ధమవుతున్నాయి. అయితే, ఆసియా కప్‌ (Asia Cup 2023) ఫైనల్‌ జరగనున్న కొలంబోలో వరుణుడి ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తోంది. అడపాదడపా వర్షం పడినా.. మ్యాచ్‌ రద్దు అయ్యే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇవాళ పూర్తిస్థాయి మ్యాచ్‌ నిర్వహించేందుకు అనుకూలంగా లేకపోయినా రిజర్వ్‌డే ఎలానూ ఉంది. ఆసియా కప్‌ చరిత్రలో ఇప్పటి వరకు భారత్-శ్రీలంక (IND vs SL) జట్లు ఫైనల్‌లో ఎనిమిది సార్లు తలపడగా.. టీమ్‌ఇండియా అత్యధికంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు శ్రీలంక టైటిల్‌ ఎగరేసుకుపోయింది. మరి ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అయితే, ఈ లోగా వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందో తెలుసుకుందాం.. ప్రస్తుతం కొలంబో వాతావరణం పొడిగానే ఉంది. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. తేమశాతం కూడా 65%  మాత్రమే ఉంది. 

ఒక్కో గంటకు ఇలా..

  • 12 గంటలు: మేఘావృతై ఉంటుంది. కానీ, వర్షం పడేందుకు అవకాశాలు 49 శాతంగా ఉంది. గాలిలో తేమ 67 శాతంగా నమోదవుతుంది.
  • మధ్యాహ్నం 1 గంటకు: ఈ సమయంలో కాస్త వర్షం పడే అవకాశాలు పెరుగుతాయి. 66 శాతంగా ఉంటాయి. కాబట్టి మెరుపులతో చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తేమశాతం 76కి పెరుగుతుంది. 
  • 2 గంటలు: మళ్లీ చినుకులు పడటం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి రావచ్చు. ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీలుగా ఉండనుంది. వర్షం పడేందుకు 49 శాతం అవకాశం ఉంది. 
  • 3 గంటల నుంచి 5 గంటల వరకు: టాస్‌ వేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్‌ వేస్తారు. వాతావరణం పొడిగానే ఉండొచ్చు. అక్కడక్కడా మబ్బులు ఉంటాయి. వర్షం పడే అవకాశం 49 శాతం మాత్రమే. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 
  • 6 గంటలు: మరోసారి వరుణుడు అడ్డొస్తాడని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో వర్షం పడే అవకాశాలు 61 శాతంగా ఉండటం గమనార్హం. తేమ శాతం 87%గా నమోదైంది. అయితే, కాసేపు మాత్రమే వాన పడొచ్చు. 
  • రాత్రి 7 గంటలు: సాయంత్రం 6 గంటల నుంచి వచ్చే వర్షం త్వరగా ఆగిపోతే మాత్రం మ్యాచ్‌ మళ్లీ పునఃప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల సమయంలో ఎలాంటి వాన జాడ ఉండకపోవచ్చు. ఆ సమయంలో వాతావరణంలో తేమశాతం 86శాతంగా ఉంటుందని అంచనావేయడంతో వర్షం పడే అవకాశం 49 శాతంగానే ఉంది. 
  • 8 గంటలు: మళ్లీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. వర్షం పడే అవకాశం 57 శాతంగా ఉంది. ఎక్కువగా వాన లేకపోతే మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించడానికి పెద్దగా సమయం తీసుకోరు.
  • 9 గంటలు: ఈ సమయానికి వర్షం ఉండదు. కానీ, అంతకుముందు కురిసే వాన పరిస్థితిపైనే మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అప్పటికి మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం వచ్చేందుకు 49 శాతం మాత్రమే ఛాన్స్ ఉంది. 
  • 10 గంటలు: ఈసారి మాత్రం వర్షం పడే అవకాశం దాదాపు 66 శాతంగా ఉంది. కాస్త ఎక్కువగానే వర్షం పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మ్యాచ్‌ పునఃప్రారంభానికి ఇదే సమయం కీలకం. ఈ సమయంలో ఎంత తీవ్రంగా వర్షం పడుతుందో చూసి దానిని బట్టి మ్యాచ్‌న రిజర్వ్‌డేకు వాయిదా వేస్తారు. 
  • 11 గంటలు: వాతావరణ శాఖ నివేదికను బట్టి ఈ సమయానికి వర్షం తగ్గినా.. మ్యాచ్ నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉంటాయా..? అనేది అనుమానమే. ఒక వేళ పిచ్‌ సిద్ధం కాకపోతే మాత్రం మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు వాయిదా వేసి.. మిగతా మ్యాచ్‌ను సోమవారం నిర్వహిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని