Team India: మళ్లీ రమీజ్‌ రజా అవాకులు.. ఈసారి భారత బౌలింగ్‌పై చెవాకులు!

టీమ్‌ఇండియా క్రికెట్ (Team India)పై ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉండే వ్యక్తి రమీజ్‌ రజా (Ramiz Raja). ఈసారి కూడా మరోసారి నోరు పారేసుకొన్నాడు.

Published : 04 Feb 2023 15:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) గెలిచినా.. ఓడినా సరే పాకిస్థాన్‌ (Pakistan) మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రజా (Ramiz Raja) విమర్శించడానికి, అవాకులు చెవాకులు పేలటానికి సిద్ధంగా ఉంటాడు. ఇటీవల న్యూజిలాండ్‌పై భారత్‌ వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే పాక్‌ బౌలింగ్‌తో పోలిస్తే భారత బౌలింగ్‌ కాస్త బలహీనంగా ఉందని రమీజ్‌ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో పాక్‌ బౌలింగ్‌ను టీమ్ఇండియా (Team India) అనుసరిస్తోందని పేర్కొన్నాడు. ఇరు జట్ల పేస్‌ బౌలింగ్‌ మధ్య సారూప్యతను ఎత్తిచూపాడు. 

‘‘పాక్‌ బౌలింగ్‌ అటాక్‌ను పరిశీలించి.. వారి బౌలింగ్‌ దాడిని కూడా రూపొందించిందని నేను ఎప్పట్నుంచో భావిస్తున్నా. హారిస్ రవూఫ్‌ మాదిరిగానే ఉమ్రాన్‌ మాలిక్‌.. షహీన్ షా అఫ్రిదిలా అర్ష్‌దీప్‌ సింగ్‌.. ఇక మిడిల్‌ ఓవర్లలో వసీమ్ జూనియర్‌ మాదిరిగా హార్దిక్‌ పాండ్య బౌలర్లుగా తయారు చేసుకొంది. శివమ్‌ మావి సపోర్టింగ్‌ బౌలర్‌గా సిద్ధం చేసింది. అయితే భారత పేస్ దళం పాక్‌ కంటే తక్కువే కానీ.. స్పిన్‌ విభాగం మాత్రం పటిష్ఠమైంది. స్పిన్‌ బౌలింగ్‌ను బలోపేతం చేసుకోవాలని ఎప్పుడూ పాక్‌ జట్టుకు సూచిస్తూ ఉంటా. ఇక న్యూజిలాండ్‌ - భారత్‌ జట్ల (IND vs NZ) మధ్య జరిగిన మ్యాచ్‌లను చూశా.  భారత బౌలింగ్‌ సాధారణంగా అనిపించింది. కివీస్‌ ఆందోళనకు గురై సిరీస్‌ను వదిలేసుకొంది. కానీ, భారత్‌ను స్వదేశంలో అడ్డుకోవడం అతిపెద్ద సవాలే అవుతుంది’’ అని రమీజ్‌ రజా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది శ్రీలంక, కివీస్‌ జట్ల మీద భారత్‌ వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకొంది. మరోవైపు పాక్‌ మాత్రం స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌నూ కోల్పోయి తీవ్ర విమర్శలపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని