IND vs ENG: భారత్‌ను ఓడించాలంటే.. ఇంగ్లాండ్‌కు ‘ఔట్‌సోర్సింగ్‌’ అవసరం: రవిశాస్త్రి

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులోనూ (IND vs ENG) భారత్‌ భారీ ఆధిక్యమే సాధించింది. ఇప్పటికే సిరీస్‌ను గెలిచిన టీమ్‌ఇండియా... చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది.

Published : 09 Mar 2024 00:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా (IND vs ENG) ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన పర్యటక జట్టు.. చివరి మ్యాచ్‌లోనైనా గెలుద్దామంటే.. ఇప్పటికైతే ఆ పరిస్థితులు లేవు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్‌ గిల్ సెంచరీ సాధించగా.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదుత్ పడిక్కల్‌ అర్ధశతకాలు చేసి భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపారు. ఈక్రమంలో టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే అలాంటి బౌలింగ్‌ దళాన్ని ‘ఔట్‌సోర్సింగ్‌’ చేసుకోవాలని కామెంటేటర్‌ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అతడితోపాటు సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

‘‘భారత్‌ను ఇక్కడ ఓడించడం చాలా కష్టం. టీమ్‌ఇండియాకు ఉన్న బౌలింగ్‌ విభాగమే కావాలి. దాంతోపాటు యశస్వి జైస్వాల్, రోహిత్‌.. మరికొందరిని తీసుకోవాలి’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. 

‘‘ప్రాథమికంగా ఇంగ్లాండ్‌కు ‘ఔట్‌సోర్స్‌’ రిసోర్సులు కావాలన్నమాట’’ అని సంజయ్‌ మంజ్రేకర్ అనడంతో రవిశాస్త్రి మరోసారి స్పందించాడు.

‘‘తప్పకుండా వారికి అలాంటి అవసరం ఉందని చెబుతా. భారత్‌ వేదికగా సిరీస్‌ విజయం కోసం చాలా ఏళ్లుగా వారు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 2012లో ఇంగ్లాండ్‌ ఇక్కడ సిరీస్‌ను నెగ్గింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఆ దిశగా రాలేకపోయింది’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

రోహిత్ ఏం చెప్పాడో.. నేనూ అదే చెప్పేవాడిని: సబా కరీం

భారత్‌ స్ట్రైక్‌రేట్‌ వెనక కారణం తామున్నామని ఇంగ్లాండ్ ఆటగాడు బెన్‌ డకెట్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అందుకే క్రెడిట్‌ తమ జట్టుకూ ఇవ్వాలని అప్పట్లో అన్నాడు. ఆ విషయాన్ని ఐదో టెస్టు సందర్భంగా రోహిత్ దృష్టికి ఓ విలేకరి తీసుకొచ్చాడు. దానిపై రోహిత్ మాట్లాడుతూ.. ‘మా జట్టులో ఓ ఆటగాడు ఉండేవాడు. అతడి పేరు రిషభ్ పంత్. బెన్‌ డకెట్ అతడి ఆటను చూసి ఉండకపోవచ్చు’’ అని సమాధానం ఇచ్చాడు. దీనిపై భారత మాజీ సెలక్టర్ సబా కరీం స్పందించాడు. 

‘‘ రోహిత్‌ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. నేను కూడా అలానే స్పందించేవాడిని. ఇంగ్లాండ్‌లోని కొంతమంది ఆటగాళ్లు రిషభ్ పంత్ ఆటను చూసి ఉండకపోవచ్చు’’ అని సబా వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని