Ashes Series: ఇదిగో బెయిర్‌స్టో ఔట్.. అరెరె ‘శాండ్‌పేపర్‌’ తేవడం మరిచిపోయానే!

యాషెస్ సిరీస్‌ (Ashes Series) ప్రభావం ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ప్రధానులపైనా పడింది. సందర్భం వచ్చినప్పుడల్లా స్పందిస్తూ నెట్టింట వైరల్‌గా మారుతున్నారు.

Published : 12 Jul 2023 11:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ (Ashes Series) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈసారి ఇంగ్లాండ్‌ వేదికగా యాషెస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి టెస్టు సందర్భంగా ఏదొక అంశం వివాదాస్పదమవుతూనే ఉంది. క్యాచ్‌లు, ఔట్ చేసిన తీరు, ఎంసీసీ సభ్యులే ఆసీస్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం చూశాం. ఇరుదేశాల అభిమానులు దాడులు చేసుకునే స్థాయికి కూడా వెళ్లిపోయారు. అదే విధంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్రధానులు కూడా మాటల యుద్ధానికి దిగారు. తాజాగా మరోసారి ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌ ‘నాటో’ సమ్మిట్‌లో భాగంగా యాషెస్‌పైనా చర్చించారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ట్విటర్‌ వేదికగా వీడియోను పోస్టు చేశారు.

‘‘నాటో సమ్మిట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, యూఎస్‌ఏ (AUKUS) కూటమి భద్రత, సాంకేతికత మార్పిడి, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం, ఆసీస్-యూకే వాణిజ్య అగ్రిమెంట్ తదితర అంశాలను ఇంగ్లాండ్‌ ప్రధాని రిషి సునాక్‌తో చర్చించా. అదే క్రమంలో మేమిద్దరం యాషెస్‌ సిరీస్‌ గురించి కూడా చర్చించుకున్నాం’’ అని అల్బానీస్‌ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మూడు టెస్టులు ముగిసేసరికి ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. 

వీడియోలో ఇలా.. 

తొలుత ఆసీస్‌ ప్రధాని  తమ జట్టు 2-1 ఆధిక్యంలో ఉందంటూ ప్లకార్డును ప్రదర్శించగా.. లీడ్స్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ గెలిచిందంటూ రిషి సునాక్‌ ప్రతి స్పందించారు. దీంతో వెంటనే జానీ బెయిర్‌స్టో ఔట్‌ను ప్రస్తావిస్తూ ఆసీస్‌ ప్రధాని మరో పేపర్‌ను చూపించారు. అయితే, రిషి సునాక్‌ నవ్వుతూనే ‘నేను శాండ్‌ పేపర్‌ను తీసుకురావడం మరిచిపోయా’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆసీస్‌ ప్రధాని కూడా సునాక్‌తో కలిసి నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఇద్దరూ కరచాలనం చేసుకుని భేటీని ముగించారు.

అసలేంటీ శాండ్‌పేపర్‌ స్కాండల్‌

రిషి సునాక్‌ ప్రస్తావించిన ‘శాండ్‌ పేపర్‌’ వివాదం ఐదేళ్ల కిందట జరిగింది. 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్‌ ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ శాండ్‌పేపర్‌ ముక్కతో బంతిని రుద్దడం టీవీల్లో కనిపించింది. స్వింగ్‌కు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, వైస్‌ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ ఉన్నట్లుగా తేలడంతో వారిపై ఏడాదిపాటు నిషేధం పడింది. అలా చేసిన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది. ఆ మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ స్టీవ్‌ స్మిత్ ఏడుస్తూ కనిపించాడు. కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు స్మిత్ ప్రకటించాడు. స్మిత్, డేవిడ్ వార్నర్‌ తిరిగి జాతీయ జట్టులోకి రాగా.. బాన్‌క్రాఫ్ట్‌ మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని