Rohit Sharma: రోహిత్‌ను కోల్‌కతా ఓపెనర్‌గా చూడాలనుంది : వసీమ్‌ అక్రమ్

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను కాదని ముంబయి హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి కూడా ఆ జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు.

Published : 09 May 2024 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్ భవితవ్యంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబయి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రోహిత్, హార్దిక్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సీజన్‌లో కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతున్న రోహిత్ శుభారంభాలను ఇస్తున్నప్పటికీ.. భారీ స్కోర్లుగా మాత్రం మలచలేకపోతున్నాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ముంబయి జట్టుకు రోహిత్ ఆడే అవకాశాలు చాలా తక్కువని వసీమ్‌ అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘నాకు తెలిసి.. రోహిత్ వచ్చే సీజన్‌ నుంచి ముంబయి జట్టులో భాగస్వామ్యం కాకపోవచ్చు. అతడిని కోల్‌కతా జట్టులో చూడాలని ఉంది. ఓపెనర్‌గా రోహిత్.. మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్, అయ్యర్ కెప్టెన్‌.. ఇలా ఊహించుకుంటేనే భలేగుంది. కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలమైంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో రోహిత్ రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఈ పిచ్‌పై రోహిత్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడు. గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. అందుకే, కోల్‌కతా తరఫున రోహిత్‌ను చూడాలని ఉందని గట్టిగా చెబుతున్నా. 

ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వచ్చిన తర్వాత మెరుగైంది. మైదానంలో ఆవల కూర్చుని ఆటగాళ్లతో మాట్లాడతాడు. ఒక్కసారి గేమ్‌ ప్రారంభమయ్యాక మాత్రం కెప్టెన్‌కే అన్నీ వదిలేస్తాడు. శ్రేయస్‌ కూడా నాయకుడిగా జట్టును సరైన దారిలో నడపిస్తున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ వివిధ స్థానాల్లో వస్తూ పరుగులు చేస్తున్నాడు. తమ జట్టు గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి గౌతమ్‌ ఉన్నాడనే భరోసా అతడికి ఉంది’’ అని వసీమ్‌ తెలిపాడు. ప్రస్తుతం కోల్‌కతా 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కనీసం ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారవుతుంది. మరోవైపు ఐపీఎల్ 17వ సీజన్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది. హార్దిక్ నాయకత్వంలోని ముంబయి 12 మ్యాచుల్లో కేవలం 4 విజయాలను మాత్రమే నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని