IND vs SL: ఇషాన్‌ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు: రోహిత్‌

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసలు కురిపించాడు...

Published : 25 Feb 2022 10:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసలు కురిపించాడు. చాలా కాలంగా అతడు తెలుసని, అతడి మనస్తత్వం కూడా తాను అర్థం చేసుకున్నానని రోహిత్‌ పేర్కొన్నాడు. అలాగే అతడికుండే శక్తి సామర్థ్యాలు కూడా తెలుసన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌ సిరీస్‌లో పరుగులు చేయలేక ఇబ్బందులు పడిన ఇషాన్‌కు ఇలాంటి ఒక ఇన్నింగ్స్‌ ఆడితే సరిపోతుందని తెలిపాడు. అవతలి ఎండ్‌ నుంచి అతడి బ్యాటింగ్‌ను చూడటం అద్భుతంగా ఉందన్నాడు. అనంతరం జడేజాపై మాట్లాడిన కెప్టెన్‌.. అతడు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు.

‘జడేజా నుంచి చాలా ఆశిస్తున్నాం. అందుకే అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకొచ్చాం. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటివి మరిన్ని చూస్తారు. అతడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వచ్చి పరుగులు చేయాలని నేను అనుకుంటున్నా. బ్యాటింగ్‌లో చాలా మెరుగయ్యాడు. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని ముందే బ్యాటింగ్‌కు పంపిస్తాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి నుంచి మేం ఏం సాధించాలనే విషయంపై కచ్చితమైన స్పష్టతతో ఉన్నాం’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. అలాగే తనకు పెద్ద గ్రౌండ్లలో ఆడాలంటే ఇష్టమని, అక్కడే ఒక బ్యాట్స్‌మన్‌ శక్తి సామర్థ్యాలు ఏంటనేవి తెలుస్తాయన్నాడు. మరోవైపు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడంపై మాట్లాడుతూ దానిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాకు వెళ్లేసరికి టీమ్‌ఇండియా ఈ విభాగంలో బలమైన జట్టుగా మారాలని ఆకాక్షించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని