SA vs IND: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఎంగిడి, రబాడ.. భారత్ 153 ఆలౌట్

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూలగా.. టీమ్ఇండియా (Team India).. 153 పరుగులకు ఆలౌటైంది.

Updated : 03 Jan 2024 20:12 IST

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో (SA vs IND) జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 34.5 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే భారత్‌ 98 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 55 పరుగులకే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమ్‌ఇండియా.. చివరి సెషన్‌లో అనుహ్యంగా కుప్పకూలింది. భారత్ తన చివరి ఆరు వికెట్లను 11 బంతుల వ్యవధిలో 153 పరుగుల వద్దే కోల్పోవడం గమనార్హం. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0)లను పెవిలియన్‌కు పంపాడు. రాహుల్.. వికెట్‌కీపర్‌ వెరినేకు క్యాచ్‌ ఇవ్వగా.. జడేజా, బుమ్రా స్లిప్‌లో మార్కో జాన్‌సెన్‌కు చిక్కారు. రబాడ వేసిన తర్వాతి ఓవర్‌లో కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మార్‌క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అదే ఓవర్లో సిరాజ్ (0) రనౌట్ కాగా.. ప్రసిద్ధ్‌ కృష్ణ (0) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత బ్యాటర్లలో కోహ్లీతోపాటు రోహిత్‌ శర్మ (39; 50 బంతుల్లో), శుభ్‌మన్‌ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, నండ్రీ బర్గర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. 


టీ విరామం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా స్వల్పవ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. నండ్రీ బర్గర్ వరుస ఓవర్లలో శుభ్‌మన్‌ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు), తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (0)ని ఔట్ చేశాడు. 24 ఓవర్లకు స్కోరు 111/4. కోహ్లీ (20*; 27 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (0*; 7 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 56. ఈ క్రమంలోనే టీ విరామం ప్రకటించారు.


రోహిత్ దూకుడు

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమ్ఇండియా (Team India).. బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ ఆధిక్యంలోకి వచ్చింది. రబాడ బౌలింగ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ఔటైనా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (39; 50 బంతుల్లో 7 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. లుంగి ఎంగిడి వేసిన రెండో ఓవర్లో రోహిత్ మూడు ఫోర్లు బాదాడు. నండ్రీ బర్గర్ వేసిన ఆరో ఓవర్‌లోనూ భారత కెప్టెన్‌ మూడు బౌండరీలు రాబట్టాడు. దీంతో 10 ఓవర్లకే భారత్‌ ఆధిక్యంలోకి వచ్చింది. అర్ధ శతకం దిశగా సాగుతున్న రోహిత్‌.. బర్గర్‌ బౌలింగ్‌లో మార్కో జాన్‌సెన్‌కు చిక్కాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (13*; 6 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడు ప్రదర్శిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ (24*; 36 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నాడు. 16 ఓవర్లకు స్కోరు 90/2. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 35. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని