RCB vs CSK: మిస్టర్‌ దూకుడు VS కెప్టెన్‌ కూల్‌.. గతంలో ఇలా.. ఈసారి ఎవరో...?

ఇవాళ ‘సూపర్‌ మండే’ కానుంది. ఐపీఎల్‌లో అత్యంత ఆసక్తిరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఆర్‌సీబీ X సీఎస్‌కే (RCB vs CSK) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Updated : 17 Apr 2023 13:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరు సిద్ధమవుతోంది. ఐపీఎల్‌లోనే అత్యంత క్రేజీ జట్లుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) టీమ్‌ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా (RCB vs CSK) మ్యాచ్‌ జరగనుంది. ఇప్పుడు అభిమానుల కళ్లన్నీ మిస్టర్‌ కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ - మిస్టర్‌ దూకుడు విరాట్ కోహ్లీపైనే నిలిచాయి. మరి ఈ రెండు జట్ల బలాలు ఏంటి?.. ఇదివరకు పోటీ ఎలా ఉంది..? 

రెండ్రోజుల కిందట.. (Royal Challengers Bangalore)

దిల్లీతో రెండ్రోజుల కిందట జరిగిన మ్యాచ్‌లో దిల్లీపై బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. మరోసారి తన సొంత మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. విరాట్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, వేగంగా పరుగులు సాధించడం లేదనే విమర్శలూ వస్తున్నాయి. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. వేగం గొప్పగా ఏమీలేదు. కెప్టెన్‌ డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ దూకుడుగా ఆడుతున్నా.. భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. ఇక హార్డ్‌ హిట్టర్‌ దినేశ్ కార్తిక్‌ వరుసగా విఫలం కావడం అభిమానులను ఆందోళనకు గురి చేసే అంశం. బౌలింగ్‌లో మాత్రం బెంగళూరుకు ఏమాత్రం ఇబ్బంది లేదు. సిరాజ్‌, వ్యాన్‌ పార్నెల్, వైశాక్‌, హసరంగ, షహ్‌బాజ్‌ అహ్మద్, హర్షల్‌ వంటి బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉంది. దిల్లీపై 175 పరుగుల టార్గెట్‌ను బెంగళూరు కాపాడుకోగలిగింది. అయితే డేవన్‌ కాన్వే, రుతురాజ్‌, అజింక్య రహానె, శివమ్‌ దూబే, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ వంటి చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌ను అడ్డుకోవడం బెంగళూరు బౌలర్లకు కత్తిమీద సవాలే. 

ఈసారి అలా కుదరదు.. (chennai Super Kings)

గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలైన చెన్నై (CSK) మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేయడానికి ఇష్టపడదు. చివరి ఓవర్‌లో ధోనీ - జడ్డూ ఉన్నప్పటికీ చెన్నై ఓటమిపాలైంది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకూడదు. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌ ఫలితం కీలకం. టాప్‌ ఆర్డర్‌ రాణిస్తున్నప్పటికీ.. మిడిల్‌లో సరిగా ఆడకపోవడంతో చివర్లో వచ్చే బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. బెంగళూరు బౌలింగ్‌ను కాచుకోవాలంటే టాప్‌ - ప్లేయర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడాలి. ఇక బెంగళూరు టాప్‌ బ్యాటర్లను క్రీజ్‌లో కుదురుకోనీయకుండా త్వరగా ఔట్‌ చేస్తేనే చెన్నైకి మంచిది. చిన్న అవకాశం ఇచ్చినా వీరబాదుడు బాదేయగల ఆటగాళ్లు బెంగళూరు జట్టులో ఉన్నారు. 

పిచ్‌ రిపోర్ట్‌ (Pitch Report)

చిన్నస్వామి స్టేడియంలో ఈసారి మాత్రం కొత్త పిచ్‌పై మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. టాస్‌ నెగ్గే జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరే విజయం సాధించడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో సగటున 170 నుంచి 180 పరుగుల మధ్య స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖాముఖి.. (Head To Head)

* ఐపీఎల్‌ చరిత్రలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ 30 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 19 సార్లు గెలవగా.. ఆర్‌సీబీ 10 మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత సీజన్‌లో (IPL 2022) రెండుసార్లు తలపడగా.. చెరో విజయం సాధించాయి.

* ఇప్పటి వరకు చెన్నైపై బెంగళూరు సగటు స్కోరు 155 కాగా.. సీఎస్‌కేకు 157 పరుగులు. ఆర్‌సీబీ తరఫున విరాట్ కోహ్లీ (993) మరో ఏడు పరుగులు చేస్తే చెన్నైపై వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు.  బెంగళూరుపై ధోనీ 750 పరుగులు చేసి టాపర్‌గా కొనసాగుతున్నాడు. 

* చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవీంద్ర జడేజా (18 వికెట్లు) ఉండగా.. బెంగళూరు నుంచి హర్షల్‌ పటేల్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక క్యాచ్‌ల జాబితాలో ధోనీ (15), విరాట్ (15) సరిసమానంగా ఉన్నారు. 

* చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై, బెంగళూరు 9 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో నాలుగేసి మ్యాచుల్లో ఇరు జట్లు గెలవగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఐపీఎల్‌ చరిత్రలో ఓవరాల్‌గా సీఎస్‌కేపై ఆర్‌సీబీ అత్యధిక స్కోరు 205 పరుగులు, అత్యల్ప స్కోరు 70 పరుగులు కాగా.. ఆర్‌సీబీపై సీఎస్‌కే అత్యధికంగా 215 పరుగులను, అత్యల్పంగా 71 పరుగులను సాధించింది.

తుది జట్లు (అంచనా) (Teams Prediction)

బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్), మహిపాల్ లామ్రోర్, గ్లెన్‌ మాక్స్‌వెల్, షహ్‌బాజ్‌ అహ్మద్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), వహిందు హసరంగ, హర్షల్‌ పటేల్, వ్యాన్‌ పార్నెల్, సిరాజ్, వైశాక్ విజయ్‌ కుమార్

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానె, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్ / కెప్టెన్), మహీశ్ పతిరాన, మహీశ్ తీక్షణ, తుషార్‌ దేశ్ పాండే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని