Cricket: మైనర్‌పై అత్యాచారం కేసులో నేపాల్ స్టార్‌ క్రికెటర్‌కు ఎనిమిదేళ్ల జైలు

మైనర్‌పై అత్యాచారం కేసులో నేపాల్ మాజీ కెప్టెన్‌ సందీప్ లామిచానేకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది.  

Updated : 10 Jan 2024 18:10 IST

కాఠ్‌మాండూ: మైనర్‌పై అత్యాచారం కేసులో నేపాల్ (Nepal) జాతీయ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్ లామిచానే (Sandeep Lamichhane)కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో అతడిని గత డిసెంబరులో దోషిగా తేల్చిన కాఠ్‌మాండూ డిస్ట్రిక్‌ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 2022 ఆగస్టులో కాఠ్‌మాండూలోని ఓ హోటల్‌లో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక కోర్టును ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం  బెయిలుపై విడుదలయ్యాడు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది.  

ఐపీఎల్‌ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ 

లెగ్‌స్పిన్నర్‌ సందీప్‌ లామిచానే నేపాల్‌ జాతీయ జట్టులో స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాడు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. మైనర్‌పై అత్యాచార ఆరోపణలు రావడంతో అతడిపై నేపాల్ క్రికెట్‌ అసోసియేషన్ సస్పెన్షన్‌ విధించింది. అతడు మొత్తం 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 2018, 2019లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడి 13 వికెట్లు తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని