Rajasthan: అశ్వినే స్వయంగా అడగడంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం: సంగక్కర

లఖ్‌నవూతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడంపై ఆ జట్టు కోచ్‌, డైరెక్టర్‌ కుమార సంగక్కర హర్షం వ్యక్తం చేశాడు...

Published : 12 Apr 2022 01:20 IST

ముంబయి: లఖ్‌నవూతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడంపై ఆ జట్టు కోచ్‌, డైరెక్టర్‌ కుమార సంగక్కర హర్షం వ్యక్తం చేశాడు. అశ్విన్‌ ఇలా చెయ్యడం ద్వారా ఈ లీగ్‌ చరిత్రలో తొలిసారి రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై స్పందించిన సంగక్కర మ్యాచ్‌ అనంతరం తమ ఆల్‌రౌండర్‌ త్యాగాన్ని అభినందించాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని కొనియాడాడు.

‘రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరుగుతానని అశ్విన్‌ మైదానం నుంచే మమ్మల్ని అడిగాడు. దాంతో అప్పుడు ఏం చేయాలనే విషయంపై అప్పటికప్పుడు మేం చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా పదో ఓవర్‌లో క్రీజులోకి అడుగుపెట్టిన అతడు పరిస్థితులను అర్థం చేసుకొని ఒత్తిడిలోనూ బాగా బ్యాటింగ్‌ చేశాడు. చివరికి తనంతట తానే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరుగుతానని చెప్పాడు. అలా జట్టు ప్రయోజనాల కోసం తన బ్యాటింగ్‌ను త్యాగం చేసిన అశ్విన్‌ను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి జట్టుకు ఉపయోగపడ్డాడు’ అని సంగక్కర్‌ ప్రశంసించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ (28; 23 బంతుల్లో 2x6) పరుగులు చేసి 18.2 ఓవర్‌ తర్వాత రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అతడి స్థానంలో రియాన్‌ పరాగ్‌ (8; 4 బంతుల్లో 1x6) బరిలోకి దిగి ఒక సిక్సర్‌ బాది ఔటయ్యాడు. చివరికి రాజస్థాన్‌ 165/6 స్కోర్‌తో సరిపెట్టుకుంది. ఛేదనలో లఖ్‌నవూ 162/8 స్కోర్‌కే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని