Bhuvneshwar Kumar: భువి ఫామ్‌ తగ్గడానికి కారణమదే.. సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్య

టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గత కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతడు పూర్తిగా

Updated : 27 Sep 2022 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గత కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతడు పూర్తిగా లయ తప్పుతున్నాడు. మొన్న జరిగిన ఆసియా కప్‌తో ఇటీవల ముగిసిన ఆసీస్‌తో సిరీస్‌లోనూ ఆఖరి ఓవర్లలో భువి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. త్వరలో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో అతడి ఫామ్‌పై ఆందోళనలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించాడు. భువి ఈ ఏడాది ఎక్కువగా ఆడుతున్నాడని, అలసట కారణంగానే ఫామ్‌ తగ్గిందని అన్నాడు.

‘‘భువి బౌలింగ్‌ లయ తప్పడానికి ప్రధాన కారణం.. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లోనూ ఒక్కటి మినహా అన్ని మ్యాచ్‌లు ఆడాడు. భువనేశ్వర్‌ను నేను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నా. అతడు పనిభారాన్ని ఎక్కువగా తీసుకునే వ్యక్తి కాదు. ఒకట్రెండు ఫార్మాట్లే ఆడుతాడు. ఇంకో విషయం గమనిస్తే.. విరామం తీసుకుని ఏదైనా టోర్నీలోకి పునరాగమనం చేస్తే తొలి కొన్ని మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తాడు. అందువల్ల భువి ప్రస్తుత ప్రదర్శన గురించి చెప్పదలచుకున్నది ఏంటంటే.. అతడి ఫామ్‌ తగ్గడానికి అలసటే కారణం’’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా టీమిండియాకు మంజ్రేకర్‌ పలు సూచనలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు మూడో సీమర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. హర్షల్‌ పటేల్‌ ఉన్నప్పటికీ సీమ్‌ బౌలర్‌గా అతడికి కొన్ని పరిమితులున్నాయని తెలిపాడు. ఈ విషయంలో షమీని ఎంచుకోవచ్చని సూచించాడు.

గత కొన్ని రోజులుగా డెత్‌ ఓవర్లలో భువి తేలిపోతున్నాడు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆఖర్లో వేసిన రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు ఇచ్చేశాడు. రెండో మ్యాచ్‌లో భువికి విరామిచ్చారు. అయితే మూడో టీ20లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి భువికి విశ్రాంతి కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని