Axar Patel: లేడీ లక్‌.. నాకు కలిసొచ్చింది: అక్షర్‌ పటేల్‌

తన విజయాల వెనుక రహస్యాన్ని దిల్లీ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(Axar Patel) వివరించాడు. అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

Updated : 26 Apr 2023 13:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) రెండు వరుస విజయాలతో మంచి జోరుమీదుంది. ఐదు ఓటముల తర్వాత దక్కిన ఈ విజయాలు ఆ జట్టుకు ఊపిరిపోశాయి. ఇక సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad)తో మ్యాచ్‌లో అటు బ్యాట్‌తోపాటు ఇటు బంతితో మంచి ప్రదర్శన ఇచ్చి అక్షర్‌పటేల్‌ (Axar Patel) విజయంలో కీలక పాత్ర పోషించాడు. 34 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సహకరించిన అక్షర్‌.. ఆ తర్వాత రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ విజయంపై జట్టు పేసర్‌ ముఖేశ్‌ కుమార్‌తో అక్షర్‌ మాట్లాడుతూ.. ఈ క్రెడిటంతా తన భార్య మేహా(Meha)కు ఇచ్చాడు. ‘లేడీ లక్‌.. అవును నా విజయాల వెనుక రహస్యం ఆమే. అలాగే ఆటతీరుపై నా కాన్ఫిడెన్స్‌. గత ఏడాదిగా నా బ్యాటింగ్‌ సామర్థ్యంపై నాకు విశ్వాసం పెరిగింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తాను. నిలకడగా నా ఫామ్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇక నా లేడీ లక్‌.. ఓ డైటీషియన్‌ కూడా’ అంటూ అక్షర్‌ వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో పంచుకుంది. ఈ ఏడాది జనవరిలో అక్షర్‌, మేహా వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో దిల్లీ 8 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 62 పరుగులతో కష్టాల్లో పడింది. అప్పుడు తాను డగౌట్‌లో కాఫీ తాగుతున్నానని.. ఆ వెంటనే బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చిందని అక్షర్‌ వివరించాడు. ‘అప్పుడు నేను కాఫీ ఆర్డర్‌ చేశాను. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు కాఫీ తాగడం నాకు అలవాటు. రెండు వికెట్లు పడగానే.. ఇక కాఫీ తాగాలని నాకు అనిపించింది. నా చేతిలో కాఫీ కప్పు ఉండగానే.. ఇద్దరు ఆటగాళ్లు పరుగున నా వద్దకు వచ్చి  ‘భాయ్‌.. నీ వంతు వచ్చింది.. బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లు’ అన్నారు. కాఫీ కూడా చల్లారింది. నేను బ్యాటింగ్‌కు వెళ్లాను’ అంటూ ఆరోజు ఘటనను అక్షర్‌ గుర్తుచేసుకున్నాడు.

ఇక, దిల్లీ తన తర్వాతి మ్యాచ్‌లో మరోసారి హైదరాబాద్‌తోనే తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ప్రతీకారం తీర్చుకుంటారా.. లేదా దిల్లీదే పైచేయి అవుతుందా.. చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని