
T20 World Cup: టీమ్‌ఇండియాది అద్భుత ప్రదర్శన.. పెద్ద జట్లతోనూ ఇలానే ఆడాలి: సెహ్వాగ్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు టీమ్‌ఇండియా బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్.. బుధవారం బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని రంగాల్లో రాణించి అఫ్గానిస్థాన్ మీద 66 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. దీంతో సెమీస్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకోగలిగింది. టీమ్‌ఇండియా ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా భారత జట్టును అభినందించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సభ్యుల్లో సానుకూల దృక్పథం, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. అన్ని రంగాల్లో అద్భుతమైన నైపుణ్యం కనబరిచారని పేర్కొన్నాడు. ‘‘అనుకున్న విషయాలు మీ దారిలోకి వస్తే.. ఆటోమేటిక్‌గా బాడీలాంగ్వేజ్‌లో మార్పు వస్తుందని అనుకుంటా. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు రంగాల్లో ఆధిక్యత ప్రదర్శించాం. మన జట్టు చాలా మంచి క్యాచ్‌లను అందుకుంది. ఇప్పుడే కాకుండా పెద్ద జట్లతోనూ ఇదే మైండ్‌సెట్‌తో మ్యాచ్ ఆడాలి. గెలిచినా, ఓడినా ప్రత్యర్థితో పోరాటం చేయాలి. అంతేకానీ తలొగ్గకూడదు’’అని సూచించాడు.
తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తయిన టీమ్ఇండియా.. తర్వాత న్యూజిలాండ్‌పైనా ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాలి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి మన భవితవ్యం తేలనుంది. ఈ క్రమంలో మూడు జట్లలో కాస్త కఠినమైన ప్రత్యర్థి అఫ్గానిస్థాన్. అబుదాబి వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ మీద టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 144/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచిన టీమ్‌ఇండియా (2) నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ (8) సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో బెర్తు కోసం అఫ్గాన్ (4), న్యూజిలాండ్ (4) ముందంజలో ఉన్నాయి.