Shoaib akthar: మ్యాచ్‌ ఓడి పేరు నిలబెట్టుకున్నారు.. సఫారీలకు థ్యాంక్స్‌: షోయబ్‌ అక్తర్‌

కీలక సమయంలో తడబాటుకు గురై నిరాశపరుస్తారనే పేరును సార్థకం చేసుకున్నారంటూ సఫారీలపై షోయబ్‌ అక్తర్‌ వ్యంగాస్త్రాలు సంధించాడు.

Published : 07 Nov 2022 01:54 IST

దిల్లీ: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఓడి తమకు సెమీస్‌కు చేరే అవకాశాలను బలపరచారంటూ దక్షిణాఫ్రికా జట్టుకు పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే కీలక సమయంలో తడబాటుకు గురై నిరాశపరుస్తారనే పేరును సార్థకం చేసుకున్నారంటూ వ్యంగాస్త్రాలు సంధించాడు. ఏదేమైనా తమ చిరకాల ప్రత్యర్థితో మరోసారి తలపడే అవకాశం కల్పించారంటూ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు బంగ్లాతో  పాక్‌ మ్యాచ్‌కు ముందు ఓ వీడియో సందేశాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. 

‘‘నేను ఇప్పుడే నిద్రలేచాను. దక్షిణాఫ్రికా జట్టుకు కృతజ్ఞతలు. మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడంలో మీరు గొప్పవారు. కానీ పాకిస్థాన్‌కు మీ ద్వారా మరో గొప్ప అవకాశం లభించింది. జింబాబ్వేతో ఓటమి తర్వాత సెమీ ఫైనల్స్‌కు పాక్‌ దాదాపుగా దూరమైంది. ఇప్పుడు మీ వల్ల ఒక లైఫ్‌లైన్‌ లభించింది. మేం టీమ్‌ఇండియాను మరోసారి కలుసుకోవాలనుకుంటున్నాం’’ అంటూ తెలిపాడు. ‘‘పాకిస్థాన్‌.. ఇప్పుడు దృఢంగా ఆడండి. వెళ్లి కప్‌ గెలుచుకురండి’’ అనే క్యాప్షన్‌ను ఈ వీడియోకు జతచేశాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందే టీమ్‌ఇండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి దాయాది దేశం సైతం సెమీస్‌కు దూసుకొచ్చింది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని