ICC Rankings: అగ్రస్థానానికి చేరువలో శుభ్‌మన్ గిల్, సిరాజ్‌.. మూడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్‌ సిరాజ్‌ ఆయా విభాగాల్లో అగ్రస్థానానికి చేరువయ్యారు. 

Updated : 25 Oct 2023 19:28 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ విజయాల్లో టాప్‌ ఆర్డర్ కీలక పాత్ర పోషిస్తోంది. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌పై అర్ధ శతకం బాది శుభ్‌మన్ గిల్ (Shubman Gill) లయ అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో కొనసాగుతున్నారు. గిల్ అగ్రస్థానానికి అతి చేరువలో ఉన్నాడు. పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచకప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 157 పరుగులే చేశాడు. దీంతో అతడి రేటింగ్ పాయింట్లు 829కి పడిపోయాయి. గిల్ 823 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఆరు పాయింట్లే.

ఈ ప్రపంచకప్‌లో వరుసగా సెంచరీలతో అలరిస్తున్న సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఏడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ మిస్ (95) చేసుకున్న విరాట్ కోహ్లీ మూడు స్థానాలు మెరుగై డేవిడ్ వార్నర్‌తో కలిసి ఐదో స్థానాన్ని పంచుకుంటున్నాడు. రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్ (670 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరు వికెట్లు పడగొట్టిన టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఒక స్థానం మెరుగై రెండో స్థానంలో నిలిచాడు. టాప్‌లో ఉన్న హేజిల్‌వుడ్‌, సిరాజ్ మధ్య రెండు పాయింట్ల వ్యత్యాసమే ఉంది. కుల్‌దీప్‌ యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ నుంచి హార్దిక్ పాండ్య ఒక్కడే టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. అతడు 19 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (324 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని