BCCI: శుభ్‌మన్‌ గిల్‌, రవిశాస్త్రిలకు ప్రతిష్ఠాత్మక అవార్డు

బీసీసీఐ (BCCI) అందించే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డును శుభ్‌మన్‌ గిల్‌, లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును రవిశాస్త్రి అందుకోనున్నారు. 

Published : 22 Jan 2024 21:43 IST

దిల్లీ: టీమ్ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నాడు. బీసీసీఐ (BCCI) అందించే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 అవార్డు గిల్‌కు దక్కనుంది. ఈ విషయాన్ని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మంగళవారం (జనవరి 23న) హైదరాబాద్‌లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. తొలి టెస్టు కోసం ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాడికి క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు ఇస్తారు. కరోనా కారణంగా కొన్నాళ్లుగా ఈ అవార్డుల ప్రదానాన్ని బీసీసీఐ నిలిపివేసింది. చివరిగా 2020లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

2023లో శుభ్‌మన్‌ అద్భుతంగా ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 52 ఇన్నింగ్స్‌ల్లో 2,154 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే గతేడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 29 వన్డేల్లో 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, ఐదు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టులు, టీ20ల్లో ఒక్కో శతకం బాదాడు. 


Ravi Shastri: రవిశాస్త్రికి లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు 

భారత మాజీ ఆల్‌రౌండర్‌, కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోనున్నాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకుగాను గుర్తుగా ఈ అవార్డును అందిస్తున్నారు. 1981 నుంచి 1992 మధ్య 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన శాస్త్రి కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. రిటైర్మెంట్‌ అనంతరం వ్యాఖ్యాతగా మారిన ఆయన 2014 నుంచి 2016 వరకు ఇండియా క్రికెట్‌ జట్టుకు డైరెక్టర్‌గా ఉన్నారు. 

ప్రధాన కోచ్‌గా భారత క్రికెట్‌లో అనేక మార్పులు

అనిల్‌ కుంబ్లే తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి చేపట్టిన శాస్త్రి... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సహకారంతో భారత క్రికెట్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఫాస్ట్‌ బౌలర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహించారు. ఈయన కోచ్‌గా ఉన్న కాలంలో ఇండియా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు వెళ్లింది. 2018-19, 2020-21 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2019-2021)లో ఫైనల్‌కు చేరి న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు క్రికెట్‌లో నెం1 ర్యాంకులో కొనసాగినా ఐసీసీ ట్రోఫీ మాత్రం సాధించలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని