IND vs ENG: మన కుర్రాళ్లు కన్‌ఫ్యూజ్‌ చేశారు.. బెయిర్‌స్టో బెంబేలు పడ్డాడు!

ప్రత్యర్థి బ్యాటర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి.. ఔటయ్యేలా చేయడంలో భారత కుర్రాళ్లూ తక్కువేం కాదని నిరూపించుకొన్నారు. తాజాగా బెయిర్‌స్టో ఔటైన తీరే ఇందుకు నిదర్శనం..

Updated : 09 Mar 2024 15:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న (IND vs ENG) ఐదో టెస్టులో భారత్‌ పట్టు సాధించింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పర్యటక జట్టును టీమ్‌ఇండియా బౌలర్లు బెంబేలెత్తించారు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తొలుత స్లెడ్జింగ్‌ ప్రారంభిస్తే.. టీమ్‌ఇండియా యువ క్రికెటర్లూ తామేం తక్కువ కాదని దీటుగా బదులిచ్చారు. కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న జానీ బెయిర్‌స్టోను లక్ష్యంగా చేసుకోవడం విశేషం. అతడిని ఉడికించి ఏకాగ్రతను కోల్పోయేలా చేశారు. అయితే, ఇదంతా రెండో రోజు శుభ్‌మన్‌ గిల్ - జేమ్స్‌ అండర్సన్ మధ్య ప్రారంభం కాగా.. దానిని కొనసాగిస్తూ ధ్రువ్‌ జురెల్, గిల్, సర్ఫరాజ్ ఖాన్‌ స్పందించడం గమనార్హం. వీరి దెబ్బకు తర్వాత బంతికే బెయిర్ స్టో వికెట్‌ ఇచ్చేశాడు. వీరి మధ్య మాటల యుద్ధం జరిగిందిలా.. 

బెయిర్‌స్టో: అలసిపోవడం గురించి జిమ్మీతో నువ్వేం అన్నావు? ఆ తర్వాతే నిన్ను ఔట్‌ చేశాడు కదా? 

గిల్: ఏదైతేనేమీ అదంతా 100 తర్వాతే జరిగింది. నువ్వు ఎన్ని చేశావు? 

బెయిర్‌స్టో: నువ్వు ఏం సాధించావు? ఇక్కడితో ఆపు. 

ధ్రువ్‌: నువ్వు మ్యాచ్‌ చూడలేదా? గిల్ ఎలా ఆడాడో..?

గిల్: ప్రతి ఒక్క భారత బౌలర్‌ మిమ్మల్ని ఔట్ చేస్తారు. కుల్‌దీప్‌ యాదవ్ నీకంటే బాగా బ్యాటింగ్‌ చేశాడు. నేను కూడా నీ వికెట్ తీయగలను. 

సర్ఫరాజ్‌: (బెయిర్‌స్టోను ఉద్దేశించి) ఇవాళ కొన్ని పరుగులు చేశాడు. దానికే ఎగిరెగిరి పడుతున్నాడు. 

ఇదంతా జరిగిన తర్వాత బంతికే బెయిర్‌ స్టోను కుల్‌దీప్‌ ఎల్బీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో బెయిర్‌ స్టో 39 పరుగులు చేశాడు. అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినప్పటికీ.. ఇంగ్లాండ్‌ డీఆర్‌ఎస్‌ తీసుకుంది. బంతి వికెట్లను తాకిపైకి వెళ్తున్నట్లు అనిపించింది. అప్పటికే ఫీల్డ్‌ అంపైర్ ఔట్ ఇచ్చాడు. సమీక్షలో ‘అంపైర్స్ కాల్’ రావడంతో బెయిర్‌స్టో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇదే సమయంలో గిల్‌ను ఇంగ్లాండ్ బ్యాటర్ ఏవో మాటలు అంటూ వెళ్లడం వీడియోల్లోనూ కనిపించింది. ఇప్పుడివి నెట్టింట వైరల్‌గా మారాయి.

అండర్సన్ ఏమన్నాడో చెప్పని గిల్‌..

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అండర్సన్‌తో జరిగిన వాగ్వాదాన్ని గిల్ తేలిగ్గా కొట్టిపడేశాడు. మైదానంలో ఏం అనుకున్నామనే విషయాలను చెప్పలేనని వ్యాఖ్యానించాడు. అదంతా ప్రైవేట్‌ వ్యవహారమని.. బయటకు చెప్పడం బాగోదని తెలిపాడు. కేవలం తన బ్యాటింగ్‌పైనే శ్రద్ధ పెట్టినట్లు పేర్కొన్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని