దాదా ఢీ.. కోహ్లీ ఢీ++.. మహీ కూల్‌

ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా నాయకుడు బాగాలేకుంటే ఆ జట్టు విజయాల బాటలో నడవడం కష్టం. సమష్టి తత్వం రావాలన్నా.. వ్యూహాలు రచించాలన్నా.. వాటిని పక్కాగా అమలు చేయాలన్నా.....

Published : 18 May 2021 09:42 IST

ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.. ఎవరికి వారే మేటి 

ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా నాయకుడు బాగాలేకుంటే ఆ జట్టు విజయాల బాటలో నడవడం కష్టం. సమష్టి తత్వం రావాలన్నా.. వ్యూహాలు రచించాలన్నా.. వాటిని పక్కాగా అమలు చేయాలన్నా.. ప్రత్యర్థి విసిరే సవాళ్లను దాటాలన్నా.. జట్టు సభ్యుల బలాలను వెలికితీయాలన్నా సారథి అత్యంత కీలకం. అందుకే క్రికెట్లో అతడికి అంత ప్రాధాన్యం.

అంతర్జాతీయ క్రికెట్లో పెద్దన్నగా ఎదిగిన దేశం మనది. టీమ్‌ఇండియా ఇప్పుడీ స్థాయికి రావడానికి ఎందరో నాయకులు కష్టపడ్డారు. భారత్‌కు తొలిసారి ప్రపంచకప్‌ అందించింది కపిల్‌ దేవ్‌ అయినా ఎక్కువగా చర్చకు వచ్చేది మాత్రం సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ గురించే. ఈ లాక్‌డౌన్ సమయంలో వారి నాయకత్వ శైలి, విశేషాల గురించి మరొక్కసారి గుర్తు చేసుకుందాం!


సందర్భాలు వేరు

క్రికెట్లో పగ్గాలు చేపట్టడం తేలికైన విషయమేం కాదు. నాయకత్వ మార్పిడి సులభం కాదు. అతడి గుణగణాలను పరిశీలించాలి. సమష్టితత్వం సాధించగలడా చూడాలి. నడిపించే శైలినీ గమనించాలి. వీటికి తోడు సారథ్యం అప్పగించే కాలమూ ముఖ్యమే. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కళంకంతో భారత క్రికెట్‌ చిమ్మచీకట్లోకి వెళ్లిన కాలమది. అప్పట్లో నాయకత్వం కత్తిమీద సామే. ఆటగాళ్లు ఆత్మవిశ్వాస లోపంతో బాధపడుతున్నప్పుడు సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీ చేపట్టాడు. గ్రెగ్‌ ఛాపెల్‌ కోచింగ్‌లో జరిగిన నష్టం అపారం. కుంబ్లే, ద్రవిడ్‌ నుంచి ఎంఎస్ ధోనీ పగ్గాలు అందుకున్నాడు. 2014 ఆసీస్‌ పర్యటనలో కోహ్లీ టెస్టు బాధ్యతలు స్వీకరించాడు. మరికొన్నాళ్లకే పరిమిత ఓవర్ల క్రికెట్‌ నాయకత్వం చేపట్టాడు.


భిన్నమైన శైలి

అంతర్జాతీయ క్రికెట్లో ఒక్కో నాయకుడిది ఒక్కో శైలి. దాదా, మహీ, కోహ్లీ నాయకత్వ శైలులు సైతం భిన్నమైనవే. 1990 నుంచి ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం అందరికీ తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్లూ అలాగే ఉండేవారు. ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారు. ఆంగ్లేయుల పొగరూ తక్కువేం కాదు. అలాంటి జట్లను గట్టిగా ఎదుర్కొన్న సారథి గంగూలీ. భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేశాడు. ఢీ.. అంటే ఢీ అనేవాడు. ఆసీస్‌ సారథినే టాస్‌ కోసం ఎదురుచూసేలా చేశాడు. అటు యువకులు ఇటు సీనియర్లతో పటిష్టమైన జట్టును నిర్మించాడు. యువకుల కోసం తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకున్నాడు. ఇక ఎంఎస్‌ ధోనీ ప్రశాంతతకు మారుపేరు. ప్రత్యర్థికి తన ఆలోచనలు తెలియకుండా జాగ్రత్తపడేవాడు. పక్కగా వ్యూహాలు రచించి అమలు చేసేవాడు. కొన్ని సందర్భాల్లో జట్టు గెలిచినా సంబరాలు చేసుకోకుండా అవతలి జట్టు ఆలోచనలను ప్రభావితం చేసేవాడు. ఇక కోహ్లీ భావోద్వేగాలు ప్రదర్శించడంలో మేటి. అవసరమైతే సీనియర్ల సలహాలూ బహిరంగంగానే తీసుకుంటాడు. ప్రత్యర్థి కవ్విస్తే మాత్రం ఢీ కాదు ఢీ++ అంటాడు! ప్రతిసారీ జట్టు మార్చడం అతడికో అలవాటు.


మధుర విజయాలు

టీమ్‌ఇండియాకు ఈ నాయక త్రయం అందించిన విజయాలు అపూర్వం! దాదా నాయకత్వం చేపట్టిన తొలినాళ్లలో జట్టు గెలిచినా.. ఓడినా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కామెంట్లు వినిపించేవి. అలాంటి వ్యాఖ్యలు మళ్లీ వినిపించకుండా చేసింది 2001 ఆస్ట్రేలియా సిరీస్‌. వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, హర్భజన్‌ మెరుపులతో భారత్‌ తన చరిత్రలోనే అద్భుతమైన విజయం అందుకుంది. ఇంగ్లాండ్‌పై నాట్‌వెస్ట్‌ సిరీస్‌ గెలుపూ మధురమే. 2003 ప్రపంచకప్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలవడమూ దాదా ఘనతే. ఇక ఆసీస్‌, న్యూజిలాండ్‌, పాక్‌, దక్షిణాఫ్రికా వంటిదేశాల్లో దాదాసేన టెస్టు విజయాలు అందుకొంది. ఇక ఎంఎస్‌ ధోనీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అతడు సాధించనిది ఏముంది! ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోపీ, ఆసియా కప్‌లు అందించాడు. విరాట్‌ కోహ్లీ సైతం గత జట్లు సాధించలేని రికార్డులు నెలకొల్పాడు. శ్రీలంకపై విజయాలు.. ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను మట్టికరిపించడం.. స్వదేశంలో వరుస టెస్టు సిరీసులు సాధించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిపాడు. 2019 ప్రపంచకప్‌లో సెమీస్‌కు తీసుకెళ్లాడు.


గణాంకాలూ మేటి

దాదా, ధోనీ, కోహ్లీ కెప్టెన్సీ గణాంకాలు వారి తరాల్లో గొప్పవే. గంగూలీ 424 అంతర్జాతీయ మ్యాచులాడి 41.46 సగటుతో 18,575 పరుగులు సాధించాడు. నాయకుడిగా 196 మ్యాచుల్లో 38.32 సగటుతో 7,665 పరుగులు చేశాడు.  49 టెస్టులకు నాయకత్వం వహించి 21 గెలిపించాడు. 13 ఓడాడు. వరుసగా 33 టెస్టులకు సారథ్యం వహించిన రికార్డు దాదా సొంతం. మహీ 3 ఫార్మాట్లలో 538 మ్యాచులాడి 44.96 సగటుతో 17,266 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా 332 మ్యాచుల్లో 46.89 సగటుతో 11,207 పరుగులు సాధించాడు. 60 టెస్టులకు సారథ్యం వహించి 27 మ్యాచులు గెలిపించాడు. 18 ఓడాడు. వరుసగా 27 టెస్టులకు నాయకత్వం వహించడం గమనార్హం. ఇక విరాట్‌ మొత్తం 435 మ్యాచులాడి 55.78 సగటుతో 22818 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా 200 మ్యాచులాడి 62.33 సగటుతో 12,343 పరుగులు అందుకున్నాడు. 60 టెస్టుల్లో సారథ్యం వహించి 36 గెలిపించాడు. 14 ఓడాడు. టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున ఇదే అత్యుత్తమ రికార్డు. వరుసగా 25 టెస్టుల్లో సారథ్యం వహించాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని