SA vs IND: విజృంభించిన రబాడ.. టీమ్ఇండియాను ఆదుకున్న కేఎల్ రాహుల్.. తొలి రోజు ఆట పూర్తి

సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది. 

Updated : 26 Dec 2023 21:28 IST

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా తడబడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కగిసో రబాడ (5/44) విజృంభించడంతో తొలి రోజు 59 ఓవర్ల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మొదటి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. టాప్‌ ఆర్డర్ విఫలమైన వేళ.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (70*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్‌కు తోడుగా సిరాజ్ (0*) నాటౌట్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24), యశస్వి జైస్వాల్ (17) పరుగులు చేశారు. రోహిత్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. నండ్రీ బర్గర్ 2, మార్కో జాన్సన్ ఒక వికెట్ పడగొట్టారు.వర్షం వల్ల తొలి రోజు ఓవర్లు 31 ఓవర్లు కోల్పోవడంతో మ్యాచ్‌ బుధవారం అరగంట ముందుగానే (మధ్యాహ్నం ఒంటి గంట) ప్రారంభంకానుంది. 

రప్ఫాడించిన రబాడ.. నిలబడిన కేఎల్ రాహుల్ 

భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మను రబాడ వెనక్కి పంపాడు. రోహిత్ ఫుల్‌షాట్ కొట్టబోయి ఫైన్‌లెగ్‌లో నాండ్రీ బర్గర్ చేతికి చిక్కాడు. కాసేపటికే నాండ్రీ తన వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి పంపాడు. వీరిద్దరూ వికెట్‌కీపర్ వెరినేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరారు. దీంతో భారత్ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టడంతో భోజన విరామ సమయానికి భారత్ 91/3 స్కోరుతో నిలిచింది. లంచ్ తర్వాత రబాడ విజృంభించడంతో టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ను చక్కటి ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేసిన రబాడ.. కాసేపటికే కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన అశ్విన్‌ (8) స్లిప్‌లో వియాన్ ముల్డర్‌కి చిక్కాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్.. శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నిలకడగా బౌండరీలు బాదిన శార్దూల్‌..  షార్ట్ మిడాఫ్‌లో ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో రబాడ ఖాతాలో ఐదో వికెట్ పడింది. టీ విరామ సమయానికి టీమ్‌ఇండియా 176/7 స్కోరుతో నిలిచింది. చివరి సెషన్‌లో నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో రాహుల్ వరుసగా 4,6 బాది 80 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. బుమ్రా (1)ని జాన్సన్ బౌల్డ్ చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని