WTC Final: జడ్డూ, యాష్‌ ఉండాల్సిందే: సన్నీ

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ ఇద్దరినీ ఆడించాలని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. సౌథాంప్టన్‌లో వాతావరణం చాలా పొడిగా ఉంటుందని తెలిపారు. మ్యాచ్‌ సాగే కొద్దీ పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు అనుకూలిస్తుందని పేర్కొన్నారు....

Published : 17 Jun 2021 01:44 IST

విరాట్‌ కోహ్లీ విజయమంత్రం అదేనన్న గావస్కర్‌

దిల్లీ: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ ఇద్దరినీ ఆడించాలని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సూచించారు. సౌథాంప్టన్‌లో వాతావరణం చాలా పొడిగా ఉంటుందని తెలిపారు. మ్యాచ్‌ సాగే కొద్దీ పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు అనుకూలిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా జడ్డూ, యాష్‌ ఆల్‌రౌండ్‌ సామర్థ్యాలు జట్టుకు ఉపయోగపడతాయని వివరించారు. వారిద్దరూ బౌలింగ్‌ విభాగానికే కాకుండా బ్యాటింగ్‌ లైనప్‌కూ సమతూకం తీసుకొస్తారని వెల్లడించారు.

న్యూజిలాండ్‌తో ఫైనల్‌, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు కోసం సునీల్‌ గావస్కర్‌ ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. మ్యాచులకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు దినేశ్ కార్తీక్‌ సైతం వెళ్లిన సంగతి తెలిసిందే. ముందుగా వచ్చిన కివీస్‌ రెండు మ్యాచులు ఆడింది. ఐతే సాధన చేసేందుకు తగినంత సమయం దొరకలేదన్న ఆందోళన భారత్‌కు అవసరం లేదని సన్నీ అంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఏ జట్టుకూ సన్నహాక మ్యాచులు ఆడేందుకు సమయం ఉండటం లేదని గావస్కర్‌ తెలిపారు. అంతర్గత మ్యాచ్‌, సాధన సరిపోతుందని వెల్లడించారు. జట్టు యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉందని, చాలామంది ఆటగాళ్లు గతంలో ఇంగ్లాండ్‌లో ఆడినవాళ్లేనని గుర్తు చేశారు. ఎర్రాపల్లి ప్రసన్న, హర్భజన్‌ సింగ్‌తో పాటు అశ్విన్‌ బౌలింగ్‌ను ఆస్వాదించడం తన అదృష్టంగా పేర్కొన్నారు.

‘వాళ్లంతా గొప్ప బౌలర్లు. ప్రసన్నను విలీ ఫాక్స్‌ అనేవారు. ఎందుకంటే అతడు బ్యాట్స్‌మెన్‌ చెత్త షాట్లు ఆడేలా ఉసిగొల్పేవాడు. నేరుగా బంతులు విసిరి వికెట్లు తీసేవాడు. ఇక హర్భజన్‌ బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. పైగా అతడి అమ్ముల పొదిలో దూస్రా ఉండేది. కనిపించకుండానే ఆ బంతి లెగ్‌ నుంచి ఆఫ్‌సైడ్‌ టర్నయ్యేది. అశ్విన్‌ బౌలింగ్‌లో వీటికి అదనంగా ఫ్లికర్‌ లేదా క్యారమ్‌ బంతి ఉంది. పైగా బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించేందుకు అతడు కొన్నిసార్లు ధైర్యంగా లెగ్‌స్పిన్‌ వేస్తుంటాడు. ప్రసన్నతో కలిసి ఆడటం, వీరి బౌలింగ్‌ను చూడటం నా అదృష్టం’ అని సన్నీ అన్నారు.

వన్డే క్రికెట్‌ ప్రభావం బ్యాట్స్‌మెన్‌ ఎంతగానో ఉంటుందని గావస్కర్‌ తెలిపారు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో వచ్చిన బంతిని సైతం ఆడగలుగుతున్నారని పేర్కొన్నారు. చాలాసార్లు స్వింగ్‌ అవ్వని బంతులకు ఔటవుతుంటారని, ఇంగ్లాండ్‌లో మాత్రం స్వింగ్‌కే బలవుతారని వెల్లడించారు. అందుకే బంతికి దగ్గరగా ఆడటం ముఖ్యమని సూచించారు. ‘ఫ్లాట్‌ పిచ్‌లపైనా విరాట్‌ కోహ్లీ లైన్‌లోనే ఆడతాడు. పిచ్‌ ఎలాగున్నా ఆలస్యంగా బంతిని ఆడతాడు. అందుకే అతడు అన్ని వికెట్లపై విజయవంతం అవుతున్నాడు. ఈ మధ్య కాలంలో అతడు సెంచరీ కొట్టలేదు. కానీ చెన్నైలో ఆడిన 60 పరుగుల ఇన్నింగ్స్‌ అద్భుతం. స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఆడాలో చూపించాడు. బంతిని ముందుగానే పసిగట్టడం అతడి అలవాటు’ అని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

’2019 వన్డే ప్రపంచకప్‌లోని ఫామ్‌నే రోహిత్‌ శర్మ మరోసారి ప్రదర్శించగలడు. అప్పటితో పోలిస్తే అతడు మరింత అనుభవం సంపాదించాడు. పరిస్థితులు, పిచ్‌లకు అతడు అలవాటు పడగలడు. అందుకు సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికా చేసిన శతకమే ఉదాహరణ. ఇక రిషభ్ పంత్‌ షాట్ల ఎంపిక మరింత మెరుగైంది. ఆసీస్‌లో మనం దాన్ని చూశాం. అతడి వల్ల జట్టుకు మరో అదనపు పేసర్‌ లేదా స్పిన్నర్‌ను తీసుకొనే అవకాశం దొరుకుతోంది. శుభ్‌మన్‌, రోహిత్‌, విరాట్‌, చెతేశ్వర్‌, ఇతర బ్యాట్స్‌మన్‌ షాట్ల ఎంపిక బాగున్నంత వరకు టీమ్‌ఇండియా పరుగులకు కొరత లేదు’ అని సన్నీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని