IPL 2024: ఐపీఎల్ 2024.. సగం సీజన్‌కు సీఎస్‌కే స్టార్‌ బ్యాటర్ దూరం!

ఐపీఎల్‌ 17వ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. గత సీజన్‌లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ ఈసారి సగభాగానికి దూరం కానున్నాడు.

Published : 04 Mar 2024 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి 15 రోజుల షెడ్యూల్‌ను ఐపీఎల్‌ నిర్వాహకులు వెల్లడించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టాడు. అయితే, సీఎస్‌కేకు చిన్నపాటి షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్ డేవన్ కాన్వే ఈ సీజన్‌ తొలి భాగంలో ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. అతడిని పరిశీలించిన వైద్యబృందం శస్త్రచికిత్స అవసరమని.. కనీసం 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరం ఉంటాడు. దీంతో ఏప్రిల్ చివరినాటికి సిద్ధమై.. రెండో సగానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కాన్వేనే. 16 మ్యాచుల్లో 672 పరుగులు చేశాడు. అయితే, సీఎస్‌కే నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో చెన్నై తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 

ఆరెంజ్‌ క్యాప్‌ అతడిదే: చాహల్

ఐపీఎల్ 17వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను  ఎవరు సొంతం చేసుకుంటారనే దానిపై యుజ్వేంద్ర చాహల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ లేదా జోస్ బట్లర్ టాప్‌ స్కోరర్‌గా నిలుస్తారని వ్యాఖ్యానించాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. ‘‘ఆరెంజ్‌ క్యాప్‌ వారిద్దరిలో ఒకరు దక్కించుకుంటారు. అలాగే ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ను నేను సొంతం చేసుకుంటా (నవ్వుతూ). నా  తర్వాత గుజరాత్ టైటాన్స్‌ బౌలర్ రషీద్‌ ఖాన్‌ ఉంటాడు’’ అని చాహల్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని