IND vs WI : 15 రోజుల ముందే వెళ్లొచ్చు కదా.. ఆ పొరబాట్ల నుంచి నేర్చుకోరా..?: గావస్కర్‌

టీమ్‌ఇండియా(Team India) తన తప్పుల నుంచి నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదని మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Updated : 10 Jul 2023 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  WTC Finalలో టీమ్‌ఇండియా(Team India) దారుణ వైఫల్యం అనంతరం.. రోహిత్‌ సేనపై విమర్శల దాడి పెరిగింది. సరైన ప్రిపరేషన్‌ లేకపోవడమే తమ ఓటమికి కారణమని సారథి రోహిత్‌ శర్మ(Rohit Sharma) పేర్కొన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌(IND vs WI)తో మ్యాచ్‌లు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రోహిత్‌ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) టీమ్‌పై మండిపడ్డాడు. 

టీమ్‌ఇండియా చేసిన తప్పులను సరిదిద్దుకుంటున్నట్లు కనిపించడం లేదని గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. WTC Final తర్వాత విండీస్‌ పర్యటనకు దాదాపు నెల రోజుల సమయం దొరికినా.. టీమ్‌ఇండియా సన్నద్ధత తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘మనం ఎలాంటి సన్నద్ధత గురించి మాట్లాడుకుంటున్నాం? టీమ్‌ఇండియా విండీస్‌ పర్యటనకు వెళ్లింది. ఇప్పటికే మీరు WTC Finalలో ఓడిపోయి ఉన్నారు. ఆ తర్వాత మీరేమైనా మ్యాచ్‌లు ఆడారా? 20-25 రోజులు ఏం చేశారు. ప్రిపరేషన్‌ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు.. దానికి కట్టుబడి ఉండాలి కదా. 15 రోజుల ముందే వెళ్లి రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడొచ్చు కదా’ అని గావస్కర్‌ విమర్శించాడు.

ముందుగానే ఆటగాళ్లు అక్కడికి వెళ్లరని.. జట్టులో వారి స్థానాలు పదిలంగా ఉండటమే ఇందుకు కారణమని గావస్కర్‌ పేర్కొన్నారు. ఇలా ముందుగా వెళ్తే.. పని భారం కూడా పెరుగుతుందని భావించడం అసలు అర్థం కాని విషయమని తెలిపాడు.

‘ప్రధాన ఆటగాళ్లు ముందుగా వెళ్లకపోవడానికి కారణం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాము జట్టులో ఉంటామనే నమ్మకం. ఒకవేళ ముందుగా వెళ్తే.. పనిభారం గురించి మాట్లాడతారు. ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌నెస్‌ కలిగిన జట్టు అని మీరు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ టీ20 క్రికెట్‌ యుగంలో పనిభారం మీకు ఎలా సమస్య అవుతుంది?’ అని గావస్కర్‌ ప్రశ్నించాడు.

ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న విండీస్‌ పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. జులై 12 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. 20 నుంచి రెండు టెస్టు ఆరంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని