SA vs IND: రెండో టెస్టు కోసం రెండే మార్పులు.. గత టెస్టులో అతడితో ఎక్కువగా బౌలింగ్‌ వేయించలేదు: గావస్కర్

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమ్‌ఇండియా (SA vs IND) తప్పనిసరిగా గెలవాలి. లేకపోతే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం. తొలి టెస్టులో బరిలోకి దిగిన తుది జట్టును మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

Published : 01 Jan 2024 17:29 IST

ఇంటర్నెట్ డెస్క్: బుధవారం నుంచి దక్షిణాఫ్రికా - భారత్ (SA vs IND) జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన టీమ్‌ఇండియా సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిందే. దీంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టులో కేవలం రెండు మార్పులు చేస్తే సరిపోతుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 

‘‘నేను సూచించే తుది జట్టులో పెద్దగా మార్పుల్లేవు. కేవలం రెండు మాత్రమే. ఫిట్‌నెస్‌ సాధిస్తే రవీంద్ర జడేజా తుది జట్టులోకి తీసుకోవాలి. రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కన పెట్టొచ్చు. తొలి టెస్టులోనూ అతడితో ఎక్కువగా ఓవర్లు వేయించలేదు. బ్యాటింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అశ్విన్‌ స్థానంలో జడ్డూను ఎంపిక చేసుకోవచ్చు. ఇక రెండో మార్పు టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలో ముకేశ్‌ కుమార్‌ను తీసుకోవాలి’’ అని గావస్కర్ తెలిపాడు. 

2023... మనకు అద్భుత సంవత్సరమే

‘‘భారత క్రికెట్‌లో గతేడాది అద్భుతమైందే. మరీ ముఖ్యంగా మహిళా క్రికెట్‌లో అపూర్వ విజయాలు దక్కాయి. గత సంవత్సరం ముగింపులో వరుసగా రెండు టెస్టుల్లోనూ విజయం సాధించింది. మహిళా టెస్టు చరిత్రలో ఇంగ్లాండ్‌పై భారీ విజయం నమోదు చేయగా.. ఆసీస్‌ను తొలిసారి టెస్టుల్లో మట్టికరిపించింది. ఇక పురుషుల క్రికెట్‌లో మనకి కలిసిరాని వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మినహా అన్ని మ్యాచుల్లోనూ గెలిచింది’’ అని గావస్కర్‌ వెల్లడించాడు.

చోకర్స్ వ్యాఖ్యలు తగవు: వెంకటేశ్‌ ప్రసాద్

వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత కొందరు అభిమానులు టీమ్‌ఇండియాను ‘చోకర్స్‌’గా అభివర్ణిస్తూ నెట్టింట పోస్టులు పెట్టారు. తాజాగా ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశాడు. ‘‘2020-21 సీజన్‌లో 36 పరుగులకే ఆలౌటైన తర్వాత.. రెండు టెస్టు సిరీస్‌లను భారత్‌ గెలిచింది. కీలకమైన ఆటగాళ్లు గైర్హాజరీలోనూ విజయాలను నమోదు చేసింది. కాబట్టి, ఐసీసీ టోర్నీల్లో గెలవలేకపోయినంత మాత్రాన తప్పుబట్టాల్సిన అవసరం లేదు’’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని