MS Dhoni: ధోనీ ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌.. హోంగ్రౌండ్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేసిన సీఎస్‌కే

ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) ముగింపు దశకు చేరుతోంది. రెండు వారాల్లో ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. వచ్చే వారం నుంచి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో సీఎస్‌కే (CSK) లీగ్‌ స్టేజ్‌లో హోంగ్రౌండ్‌ వేదికగా చివరి మ్యాచ్‌ను ఆడేసింది. ఇంటా, బయటా పద్ధతిలో ఏడేసి మ్యాచ్‌లు జరుగుతాయి.

Published : 15 May 2023 07:55 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. కొన్ని జట్లకు ఒక్కో మ్యాచ్‌ మిగిలి ఉండగా.. మరికొన్నింటికి రెండేసి ఉన్నాయి. తాజాగా చెన్నైసూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల (CSK vs KKR) మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో సీఎస్‌కే ఓటమిపాలైంది. అయినా ప్లేఆఫ్స్‌ అవకాశాలకు ఇప్పటికైతే ఇబ్బందేమీ లేదు. చెపాక్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగడంతో సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లో సొంతమైదానం వేదికగా చెన్నై జట్టుకు ఇదే చివరి మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో తమ జట్టుకు మద్దతుగా నిలిచేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ, ఫలితం సీఎస్‌కేకు సానుకూలంగా రాలేదు. అయితే, ఈ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మ్యాచ్ ముగిశాక.. చెన్నై ఆటగాళ్లు మైదానమంతా కలియతిరిగారు. టెన్నిస్‌ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్‌కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ మైదానంలోకి వచ్చి ‘కెప్టెన్ కూల్‌’ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం సన్నీ మాట్లాడుతూ.. ‘‘వచ్చే మ్యాచ్‌ల నుంచి నాకు మరో పింక్ షర్ట్‌ ఇవ్వండి’’ అని వ్యాఖ్యానించాడు. ఎంఎస్ ధోనీకిదే చివరి సీజన్‌ అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సీఎస్‌కే హోంగ్రౌండ్‌ వేదికగా ఆఖరి మ్యాచ్‌ ఆడటంతో అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 15 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. దిల్లీ క్యాపిటల్స్‌తో దిల్లీ వేదికగా మే 20న చెన్నై ఆడనుంది. దీంతో ఇరు జట్లకూ లీగ్‌ స్టేజ్‌ పోరు ముగుస్తుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని