T20 World Cup Final: కేన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్.. ఆసీస్‌ ముందు భారీ లక్ష్యం

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కీలకమైన పోరులో...

Updated : 14 Nov 2021 21:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కీలకమైన పోరులో కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ (85: 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్ ఫించ్ బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లకు కేవలం 57 పరుగులు సాధించిన కివీస్‌.. ఆఖరి పది ఓవర్లలో 115 పరుగులు రాబట్టింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ (4 ఓవర్లలో 60) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మిచెల్‌ (8 బంతుల్లో 11: ఒక సిక్స్‌) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌తో కలిసి మార్టిన్‌ గప్తిల్ (28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్‌ ఆసీస్‌ ఫీల్డర్‌ స్టాయినిస్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్స్ (18: ఒక ఫోర్, ఒక సిక్స్)తో కలిసి కేన్‌ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్‌.. తర్వాత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 14వ అర్ధశతకం నమోదు చేశాడు. ఒక పక్క ధాటిగా ఆడుతుండటం.. మరోవైపు బంతులు ఉండటంతో టీ20ల్లో కేన్‌ విలియమ్సన్‌ తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ సాధ్యపడలేదు. 85 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లలో సీఫర్ట్‌ (8*), నీషమ్‌ (13*) బ్యాటింగ్‌తో కివీస్‌ స్కోరు 170 పరుగులు దాటింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని