
T20 World cup 2007: ఆసీస్‌ను చిత్తు చేసి.. పాక్‌తో సై అని.. నేటికి పద్నాలుగేళ్లు
ముంబయి: అంతకుముందు జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఘోర అవమానం. ఒక్కసారిగా నాయకత్వం మార్పు.. దిగ్గజ త్రయం లేదు. కొత్త సారథి నేతృత్వంలో దూకుడుగా ఆడుతూ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది. ప్రత్యర్థిగా అరవీర భయంకర జట్టు ఆసీస్.. అలాంటప్పుడు పోరాడితేనే గొప్ప అనుకుంటారు ఎవరైనా. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఛాంపియన్‌ను ఓడించి మరీ పాక్‌ను ఢీకొట్టేందుకు ఫైనల్ చేరుకుంది అప్పటి యువ భారత్. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ హవా మొదలైన ఏడాది టీమిండియా అద్భుతమే సృష్టించింది. ఇది జరిగి సరిగ్గా నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కావడం విశేషం.
అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. అదే ఊపును కొనసాగించి ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తుదిపోరులోనూ పాక్‌ను చిత్తు చేసి ధోనీ సేన టైటిల్‌ను సగర్వంగా ఎత్తుకుంది. డర్బన్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. యువరాజ్ సింగ్ (70), ధోనీ (36), ఉతప్ప (34), గంభీర్ (24) రాణించడంతో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హెడెన్ (62), సైమండ్స్ (43) ధాటిగా ఆడటంతో ఒక దశలో ఆసీస్ విజయానికి చేరువైంది. కీలక సమయంలో రాణించిన భారత బౌలర్లు ఆస్ట్రేలియాను 173 పరుగులకే పరిమితం చేశారు. దీంతో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఫైనల్‌లో పాక్‌నూ చిత్తు చేసింది.