Ravindra Jadeja: అవును.. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచేందుకు తనవంతు కృషి చేస్తానని సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంటున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని పేర్కొన్నాడు...

Published : 13 Aug 2021 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచేందుకు తనవంతు కృషి చేస్తానని సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంటున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని పేర్కొన్నాడు. సరైన దేహదారుఢ్యంతో ఉండేందుకు ఎంతో కృషి చేస్తానని, విరాట్‌ కోహ్లీ అందరికీ ప్రేరణనిచ్చాడని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌ గెలిచేందుకు టీమ్‌ఇండియాకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.

‘అవును, ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. కానీ నేనిక్కడితోనే ఆగిపోను. నిరంతరం నా ఆట, ఫిట్‌నెస్‌పై శ్రమిస్తాను. ఇందుకోసం నేను విపరీతంగా భుజాల కసరత్తులు చేస్తాను. తరచూ పరుగెత్తుతాను. అలా కష్టపడతాను కాబట్టే ఫీల్డింగ్‌ బాగుంటుంది’ అని జడేజా తెలిపాడు.

విరాట్‌ కోహ్లీ మైదానంలో ఉత్సాహంగా ఉంటాడని జడ్డూ అన్నాడు. అతడెంతో దృఢంగా, చైతన్యంతో ఉంటాడని వెల్లడించాడు. ఫిట్‌నెస్‌ను అతడు ఎక్కువగా విశ్వసిస్తాడని అందువల్లే జట్టులో అంతా తమ ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పెంచుకున్నారని వెల్లడించాడు. ప్రతి ఒక్కరు శారీరకంగా శ్రమిస్తున్నారు కాబట్టే మైదానంలో ఇప్పుడు తేడా కనిపిస్తోందని పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌ ముందు ఐపీఎల్‌ ఆడటం ఉపయోగకరమని జడ్డూ అన్నాడు. ‘ఇదో మంచి అవకాశం. టీ20 ప్రపంచకప్‌లో నా జట్టును గెలిపించేందుకు ఉపయోగపడుతుంది. అవకాశం దొరికిన ప్రతిసారీ వందశాతం గెలిపించేందుకే ప్రయత్నిస్తా. ప్రపంచకప్‌లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తా’ అని చెప్పాడు.

ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని జడ్డూ అంటున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌లో జట్టు అద్భుతంగా ఉందన్నాడు. జట్టు సమతూకమూ పెరిగిందని వెల్లడించాడు. వాతావరణం కలిసొస్తే కోహ్లీసేన విజయ దుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని