Published : 07 Oct 2021 09:09 IST

IPL 2021: భారీ షాట్లు ఆడనివ్వలేదు: కోహ్లీ.. మాక్స్‌వెల్‌ని ఔట్‌ చేయాలనుకున్నాం: విలియమ్సన్

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, తమని భారీ షాట్లు ఆడనివ్వకుండా నిలువరించారని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ నాలుగు పరుగుల తేడాతో బెంగళూరుపై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లీ మాట్లాడుతూ చివర్లో తమని హైదరాబాద్‌ బౌలర్లు భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారని చెప్పాడు.

‘మేం వీలైనంత త్వరగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నాం. ఇలాంటి స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లను ఆఖరివరకూ తీసుకెళ్లాలనుకోలేదు. కానీ, ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అయితే, మాక్స్‌వెల్‌ రనౌట్‌ కావడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. మరోవైపు డివిలియర్స్‌ క్రీజులో ఉన్నంతవరకూ మేం పోటీలో ఉన్నామనే అనుకున్నాం. తొలుత బౌలింగ్‌లో బాగా రాణించినా బ్యాటింగ్‌లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయాం. ఈ క్రమంలోనే చివర్లో షాబాజ్ అహ్మద్‌ ‌(14) విలువైన పరుగులు చేశాడు. ఇది స్వల్ప స్కోర్ల మ్యాచ్‌ అయినా సన్‌రైజర్స్‌ చివరిబంతి వరకూ పోరాడింది. ఆఖర్లో వాళ్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసి మమ్మల్ని భారీ షాట్లు ఆడనివ్వకుండా అడ్డుకున్నారు. మాది ప్రొఫెషనల్‌ జట్టు అయినందున గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాం. ఒక్కోసారి ఇలాంటి ఓటములు ఎదురవుతుంటాయి. అయినా, మేం ముందుకు సాగుతుంటాం. అలాగే ఈ ఐపీఎల్‌ టోర్నీ ప్రతి సంవత్సరం కొత్త ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి యువకుడు 150 కిమీ వేగంతో బౌలింగ్‌ చేయడం బాగుంది. ఫాస్ట్‌ బౌలర్లు ఇలా రాణించడం టీమ్‌ఇండియా క్రికెట్‌కు శుభపరిణామం’ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ఇది తమకు కష్టతరమైన సీజన్‌ అయినా ఇలాంటి విజయాలు సాధించడం గొప్పగా ఉందని చెప్పాడు. ‘చిన్న చిన్న మార్పులతో ఇలాంటి ఫలితాలు సాధించడం బాగుంది. మేం చేసింది 141 పరుగులే అయినా బెంగళూరును అడ్డుకోవడానికి సరిపోతాయని అనుకున్నాం. చివరి వరకూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తే గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఎలాగైనా మాక్స్‌వెల్‌ను ఔట్ చేయాలనుకున్నాం. అదే మా విజయానికి బాటలు వేస్తుందని భావించాం. మేం ప్లేఆఫ్స్‌ పోటీలో లేకున్నా ఆటగాళ్లలో ఇలాంటి పట్టుదల చూడటం అద్భుతంగా ఉంది. అలాగే మా బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రత్యేకమని చెప్పాలి. అతడు నెట్స్‌లోనూ అంతే తీవ్రంగా సాధన చేస్తాడు. మరీ ముఖ్యంగా స్లో పిచ్‌లపైనా తన ప్రభావం చూపిస్తున్నాడు. అతడికి జట్టులో చాలా మంది సీనియర్లు సహకరిస్తున్నారు. ఇక శుక్రవారం కూడా మేం ఇలాగే ఆడి చివరి మ్యాచ్‌ను గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని