IPL 2022: మెగా ఐపీఎల్‌లో ఆ రెండు సంస్థలకే కొత్త జట్లు!

వచ్చే ఏడాది ఐపీఎల్‌ 2022 మెగా ఈవెంట్‌ పది జట్లతో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఉన్న ఎనిమిది జట్లకు తోడు మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలు ఇందులో భాగంకానున్నాయి...

Updated : 23 Feb 2024 17:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే ఏడాది ఐపీఎల్‌ 2022 మెగా ఈవెంట్‌ పది జట్లతో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఉన్న ఎనిమిది జట్లకు తోడు మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలు ఇందులో భాగంకానున్నాయి. కొత్తగా చేరే జట్లు ఖరారు కాగానే త్వరలో ఆటగాళ్ల మెగా వేలం కూడా నిర్వహించనున్నారు. అయితే, ఆ రెండు కొత్త జట్లను ఎవరు కొనుగోలు చేస్తున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాటి కోసం అహ్మదాబాద్‌, లఖ్‌నవూ నగరాలు పోటీలో ఉన్నాయి. అందులో ఒకదాన్ని సొంతం చేసుకునేందుకు భారత్‌కు చెందిన ‘ఆదాని గ్రూప్‌’ ఆసక్తి చూపిస్తుండగా మరోదానిపై ‘మాంచెస్టర్‌ యునైటెడ్‌ ప్రీమియర్‌ లీగ్’ యాజమాన్యం ‘గ్లేజర్‌ కుటుంబం’ ఆసక్తి చూపిస్తున్నట్ల తెలిసింది.

మరోవైపు ఈ రెండు ఫ్రాంఛైజీల కోసం మొత్తం 11 సంస్థలు పోటీపడుతున్నాయని సమాచారం. అయితే, అందులో ప్రధానంగా ఆదాని, గ్లెజర్‌ కుంటుంబాలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు రూ.7వేల కోట్ల నుంచి 10వేల కోట్ల దాకా వెచ్చించి కొత్త ఫ్రాంఛైజీలను చేజిక్కించుకునే వీలుందని బీసీసీఐ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఐపీఎల్‌లో ఇలా కొత్త జట్లు చేరడం ఇదే మొదటిసారి కాదు. 2010లో పుణె వారియర్స్‌, కొచీ టస్కర్స్‌ పాల్గొన్నాయి. తర్వాత మెగా ఈవెంట్‌ నుంచి వాటిని తొలగించారు. అలాగే 2016, 2017లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లను నిషేధించినప్పుడు రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ లయన్స్‌ను తాత్కాలికంగా ప్రవేశపెట్టారు.

ఆసక్తిగా ఉన్న సంస్థలు..

* సంజీవ్‌ కుమార్‌ - ఆర్‌పీఎస్‌జీ

* గ్లేజర్‌ ఫ్రామిలి - మాచెంస్టర్‌ యునైటెడ్‌ ఓనర్స్‌

* ఆదాని గ్రూప్‌

* నవీన్‌ జిందాల్‌ - జిందాల్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌

* టొర్రెంట్‌ ఫార్మా

* రోనీ స్క్రూవాలా

* అరబిందో ఫార్మా

* కోటక్‌ గ్రూప్‌

* సీవీసీ పార్ట్‌నర్స్‌

* సింగపూర్‌కు చెందిన పీఈ సంస్థ

* హిందుస్థాన్‌ టైమ్స్‌ (మీడియా)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని