Published : 25 Dec 2021 10:24 IST

Harbhajan Singh: నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించావు భజ్జీ పా: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: జట్టులోకి వచ్చిన తొలినాళ్లల్లో ప్రముఖ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తనని వెన్నుతట్టి ప్రోత్సహించాడని టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. శుక్రవారం భజ్జీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కోహ్లీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, పుజారా.. అతడితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

భజ్జీ ఒక ఫైటర్‌

‘టీమ్‌ఇండియా తరఫున అద్భుతమైన కెరీర్‌ సాగించిన హర్భజన్‌కు అభినందనలు. అతడికి 18 ఏళ్లు ఉండగా మొహాలీలో తొలిసారి చూడటం నాకింకా గుర్తుంది. చూడగానే మంచి టాలెంట్‌ ఉన్న ఆటగాడిగా కనిపించాడు. ఇప్పటివరకు అతడు సాధించింది చూస్తే నిజంగా గర్వంగా ఉంటుంది. కెరీర్‌ను చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాడు. అలాగే ఎన్నో ఎత్తుపల్లాలు కూడా చూశాడు. ఎన్ని సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో తిరిగొచ్చి కసితో ఆడేవాడు. గొప్ప ఆటగాడే కాకుండా మంచి టీమ్‌ ప్లేయర్‌ కూడా. అతడో గొప్ప పోరాట యోధుడు. టీమ్‌ఇండియా తరఫున రాణించిన అతిగొప్ప ఆటగాళ్లలో ఒకడు. అనిల్‌కుంబ్లే లాంటి ఆటగాడికి సహచరుడిగా ఉంటూ టెస్టుల్లో 400 వికెట్లు తీయడం ఆషామాషీ కాదు. అతడితో కలిసి ఆడటం సంతోషకరమే కాకుండా గర్వంగానూ ఉంది’ అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు.

711 వికెట్లు తక్కువేం కాదు

ఇక విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ.. ‘భజ్జీ పా.. భారత క్రికెట్‌లో నీ అద్భుతమైన ప్రయాణానికి అభినందనలు. 711 అంతర్జాతీయ వికెట్లు సాధించడం చాలా గొప్ప విషయం. ఈ ఘనత సాధించినందుకు నువ్వు చాలా గర్వపడాలి. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇన్నేళ్లు రాణించడం.. అన్ని వికెట్లు పడగొట్టడం అనేది మరో స్థాయి ప్రదర్శన. ఇకపై నీ జీవితంలో ఏది చేసినా ఆల్‌ ది బెస్ట్‌.  సుఖ శాంతులతో.. కుటుంబంతో మరింత ఆనందంగా ఉంటావని ఆశిస్తున్నా. అలాగే మనమిద్దరం ఆడిన రోజుల్లో జట్టులో గడిపిన క్షణాలన్నింటినీ ఎప్పటికీ గుర్తుంచుకుంటా. నేను జట్టులోకి వచ్చిన కొత్తలోనూ వెన్నుతట్టి ప్రోత్సహించావు. ఆఫ్‌ఫీల్డ్‌లోనూ మనమెంతో మంచి స్నేహితులుగా ఉన్నాం. గాడ్‌ బ్లెస్‌ యూ, టేక్‌ కేర్‌’ అని పేర్కొన్నాడు.

ఎన్నో విజయాలు అందించాడు.

‘అద్భుతమైన కెరీర్‌ సాగించిన హర్భజన్‌కు అభినందనలు. టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించావు. నేను అరంగేట్రం చేసినప్పుడు నీతో కలిసి ఆడే అదృష్టం కలిగింది. కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. భవిష్యత్‌లో నువ్వు ఏం చేసినా బాగా రాణించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా’ అని పుజారా చెప్పుకొచ్చాడు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని