IND vs SA: టీమ్‌ఇండియాప్రదర్శనతో నిరాశ చెందా..: పొలాక్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 202 పరుగులకే కుప్పకూలడంపై సఫారీల మాజీ సారథి, బౌలింగ్‌ దిగ్గజం షాన్‌ పొలాక్‌ విచారం వ్యక్తం చేశాడు...

Published : 04 Jan 2022 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 202 పరుగులకే కుప్పకూలడంపై సఫారీల మాజీ సారథి, బౌలింగ్‌ దిగ్గజం షాన్‌ పొలాక్‌ స్పందించాడు. ఈ ప్రదర్శనతో తాను నిరాశ చెందానని అన్నాడు. ఓ క్రీడా ఛానల్‌లో టీమ్‌ఇండియా వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యా. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీకు ఎలాంటి బౌలింగ్‌ దాడి ఎదురైనా దాన్ని ఎంత సమర్థంగా ఎదుర్కొంటారన్నదే ముఖ్యం. తొలి ఇన్నింగ్స్‌లో గమనిస్తే.. టీమ్‌ఇండియా బ్యాటర్లంతా క్యాచ్‌ ఔట్లకే వెనుదిరిగారు. ఆ జట్టు ఆటగాళ్లు శక్తిమేరా బ్యాటింగ్‌ చేసి వెళ్లిపోయారని నేను అనుకోవట్లేదు. ఓపెనింగ్‌లో శుభారంభం దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మిడిల్‌ ఆర్డర్‌ మొత్తం విఫలమైంది. దీంతో సరైన బ్యాటింగ్‌ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడ్డారు’ అని పొలాక్‌ అన్నాడు.

కాగా, టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా మయాంక్‌ (26), రాహుల్‌ (50) తొలి గంట నిలకడగా ఆడారు. దీంతో తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించి క్రీజులో పాతుకుపోయేలా కనిపించారు. అప్పుడే మాక్రో జాన్సన్‌.. మయాంక్‌ను తొలి వికెట్‌గా పెవిలియన్‌ పంపి ఆపై ఆధిపత్యం చెలాయించాడు. చివరికి అతడు నాలుగు వికెట్లు, రబాడ, ఒలివీర్‌ చెరో మూడు వికెట్లు సాధించి భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. చివర్లో అశ్విన్‌ (46) ధాటిగా ఆడి జట్టుకు విలువైన స్కోర్‌ అందించాడు. ఎప్పటిలాగే పుజారా (3), రహానె (0) విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని