MS Dhoni: ధోనీ ట్విటర్‌ ఖాతాకు ఏమైంది?

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ట్విటర్‌ ఖాతాలో శుక్రవారం గందరగోళం నెలకొంది. తొలుత అతడి ఖాతాకు వెరిఫైడ్‌ అకౌంట్‌ (బ్లూ టిక్‌) మార్కును తొలగించిన ట్విటర్‌ సంస్థ తర్వాత మళ్లీ జోడించడం చర్చనీయాంశంగా మారింది...

Published : 07 Aug 2021 01:36 IST

వెరీఫైడ్‌ బ్లూ టిక్‌ తొలగించి మళ్లీ జోడించిన ట్విటర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ట్విటర్‌ ఖాతాలో శుక్రవారం గందరగోళం నెలకొంది. తొలుత అతడి ఖాతాకు వెరిఫైడ్‌ అకౌంట్‌ (బ్లూ టిక్‌) మార్కును తొలగించిన ట్విటర్‌ సంస్థ తర్వాత మళ్లీ జోడించడం చర్చనీయాంశంగా మారింది. సహజంగా ధోనీ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది జనవరి 8న చివరిసారి ట్వీట్‌ చేశాడు. దాంతో చాలా రోజులుగా ధోనీ తన ఖాతాను వినియోగించడం లేని కారణంగా వెరిఫైడ్‌ అకౌంట్‌ తొలగించి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో తర్వాత మళ్లీ ట్విటర్‌ సంస్థ ధోనీ ఖాతాకు బ్లూ టిక్‌ను జోడించింది.

చివరిసారి ఈ ఏడాది జనవరి 8న ఓ పోస్టు చేసిన ధోనీ.. తాను స్ట్రాబెరీలను పండిస్తే మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ఒక్కటి కూడా మిగలదని పేర్కొన్నాడు. అప్పుడు స్ట్రాబెరీ పంట ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఆ పోస్టు పెట్టి సుమారు ఆరు నెలలు దాటిపోయిన నేపథ్యంలోనే ధోనీ ట్విటర్‌ ఖాతా నుంచి బ్లూ టిక్‌ తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా, ఎవరైనా యూజర్లు ట్విటర్‌లో వెరిఫైడ్‌ ఖాతాదారులుగా కొనసాగాలంటే కనీసం ఆరు నెలల్లో ఒకసారైనా లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అయితే, ధోనీ ఆ పరిమితి మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోనీ ఖాతాను 8.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండటం విశేషం. ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో విఫలమైన చెన్నై టీమ్‌ను ఈసారి మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చాడు. కరోనా కేసుల నేపథ్యంలో మే 4న అర్ధాంతరంగా నిలిచిపోయిన 14వ సీజన్‌లో జట్టును టాప్‌ రెండులో నిలబెట్టాడు. ఇక ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను మళ్లీ సెప్టెంబర్‌-అక్టోబర్‌లో యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దాంతో ధోనీ ఆట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని