Asia Cup 2023: ఆసియా కప్‌.. అలా మొదలైంది.. అత్యధిక మ్యాచ్‌లు ఆడింది వీరే!

మినీ టోర్నీకి సర్వం సిద్ధమైంది. ఆసియా ఖండంలోని ఆరు దేశాలు తలపడే ఆసియా కప్‌ (Asia Cup 2023) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి 1984లో మొదలైన ఆసియా కప్ ఎన్నో కష్టాలను ఓర్చి మరీ ముందుకు సాగుతోంది.

Published : 29 Aug 2023 17:46 IST

దాదాపు 40 ఏళ్ల కిందట మొదలై.. అడ్డంకులు ఎదురైనా తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. ఆసియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకొనేలా ‘ఆసియా క్రికెట్‌ కౌన్సిల్’ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఈ మినీ టోర్నీ. తొలుత కేవలం మూడు జట్లతోనే ప్రారంభమై.. ప్రస్తుతం ఆరు టీమ్‌లతో నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతి రెండేళ్లకొకసారి ఆసియా కప్‌ను నిర్వహించాలని తొలుత భావించినా.. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల వాయిదా పడిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఇలాంటి మినీ టోర్నీ ఎప్పుడెప్పుడు జరిగింది? అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్లు ఎవరు? 

Team India: ఇటు ముంబయివాలా.. అటు గుజరాతీ

తొలిసారి 1984లో ఆసియా కప్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత 1986, 1988, 1990 వరకు ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించేవారు. అయితే, దాదాపు ఐదేళ్ల తర్వాత 1995లో మళ్లీ టోర్నీ పునఃప్రారంభమైంది. మళ్లీ రెండేళ్లకు 1997లో జరిగిన టోర్నీని.. మూడేళ్ల వ్యవధి తర్వాత 2000వ సంవత్సరంలో నిర్వహించారు. వివిధ కారణాల వల్ల టోర్నీని 2004లో నిర్వహించారు. మరో నాలుగేళ్లకు 2008లో జరిగిన ఆసియా కప్‌ ఆ తర్వాత ప్రతి రెండేళ్లకొకసారి (2010, 2012, 2014, 2016) నిర్వహించడం జరిగింది. మళ్లీ నాలుగేళ్ల వ్యవధి వచ్చేయడంతో 2022లో ఆసియా కప్‌ను నిర్వహించారు. కేవలం రెండుసార్లు మాత్రమే (2016, 2022) టీ20 ఫార్మాట్‌లో ఆడారు.

కెప్టెన్‌గా ధోనీ.. ప్లేయర్‌గా మహేల

ఇప్పటి వరకు జరిగిన టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌ మహేల జయవర్థెనె. మొత్తం 28 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత సనత్ జయసూర్య 25 మ్యాచులు ఆడి 1,220 పరుగులు చేశాడు. ఇతడే ఆసియా కప్‌లో టాప్‌ స్కోరర్‌. ఇక కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచులకు నాయకత్వం వహించిన రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. ఆసియా కప్‌లో భారత్ ఆడిన 14 మ్యాచులకు కెప్టెన్సీ చేపట్టాడు.  రోహిత్ శర్మ ప్లేయర్‌గా ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో గతేడాది కెప్టెన్‌గా చేసిన ఐదు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి కూడా రోహిత్ నాయకత్వంలోనే భారత్ ఆడనుంది.

అత్యధికంగా మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్లు వీరే..

  • క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఇప్పటి వరకు భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు. సచిన్ 23 మ్యాచుల్లో 971 పరుగులు సాధించాడు. ఇవన్నీ వన్డేలు కావడం విశేషం.
  • ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్‌లో 22 వన్డేలు ఆడాడు. అయితే, మరో పది మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో ఆడటం విశేషం. అన్ని మ్యాచ్‌లను లెక్కలోకి తీసుకుంటే మహేల జయవర్థెనె (28 మ్యాచ్‌లు) కంటే  రోహిత్ శర్మనే అత్యధిక మ్యాచ్‌లు ఆడినట్లు. 
  • కెప్టెన్ కూల్‌ ఎంఎస్ ధోనీ 19 వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు. ఇందులో 14 వన్డేలకు కెప్టెన్‌గా చేశాడు. ఐదు టీ20లూ అతడి సారథ్యంలోనే టీమ్‌ఇండియా తలపడింది. 
  • మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా 18 ఆసియా కప్‌ వన్డే మ్యాచ్‌లు ఆడాడు. మిడిలార్డర్‌లో వచ్చే అజారుద్దీన్‌ మొత్తం 468 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌లకు సారథిగానూ వ్యవహరించాడు. 
  • స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే  ఆసియా కప్‌లో 15 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ఇక్కడ కుంబ్లే ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. కేవలం 14 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. 
  • ప్రస్తుత ఆసియా కప్‌ జట్టులో ఉన్న రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడాడు. ఆల్‌రౌండర్ పాత్ర పోషించే జడ్డూ 157 పరుగులు, 19 వికెట్లు తీశాడు. ఈసారి కప్‌ను సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ఏడు టీ20లూ ఆడాడు. 
  • ప్రస్తుత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (13)తోపాటు గౌతమ్‌ గంభీర్, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా పదమూడేసి మ్యాచ్‌లు ఆడారు. ఇర్ఫాన్‌ పఠాన్ (12),  దినేశ్ కార్తిక్ (12) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ 11 వన్డేలు ఆడాడు. మరో పది టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డేల్లో మొత్తం 613 పరుగులు చేసిన విరాట్.. ఈసారి మరింత దూకుడుగా ఆడతాడనడంలో సందేహం లేదు.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని