Virat Kohli: కోహ్లీ సూచనతో పొలార్డ్‌ను బోల్తా కొట్టించిన చాహల్‌

విరాట్‌ కోహ్లీ ఇప్పుడు టీమ్‌ఇండియా సారథి కాకపోయినా ఇంకా తనలో ఆ లక్షణాలు అలాగే కనిపిస్తున్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేనే అందుకు ఉదాహరణ...

Updated : 07 Feb 2022 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ ఇప్పుడు టీమ్‌ఇండియా సారథి కాకపోయినా ఇంకా తనలో ఆ లక్షణాలు అలాగే కనిపిస్తున్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేనే అందుకు ఉదాహరణ. కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికైన తొలినాళ్లల్లో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ జట్టుకు ఏదైనా అవసరం ఉంటే సలహాలు, సూచనలు చేసినట్టే ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ అలాంటి సన్నివేశాలే కనిపించాయి. విరాట్‌ పలు సందర్భాల్లో చొరవ తీసుకొన్నాడు. దీంతో భారత్‌కు రెండు కీలక వికెట్లు లభించడంలో తనవంతు కృషి చేశాడు. తొలుత చాహల్‌ వేసిన 20వ ఓవర్‌లో నికోలస్‌ పూరన్‌(18) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌(0) క్రీజులోకి వచ్చాడు. ఇది గమనించిన కోహ్లీ.. చాహల్‌కు ఓ సూచన చేశాడు. ‘ఉల్టా వాలా దాల్‌.. బిందాస్‌ దాల్‌’ అంటూ అరిచాడు.

ఈ క్రమంలోనే పొలార్డ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో కోహ్లీ వ్యూహం ఫలించిందని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అలాగే వికెట్లు పడిన సందర్భాల్లో కోహ్లీ.. రోహిత్‌తో కలిసి సెలబ్రేషన్స్‌ చేసుకోవడం కూడా అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు డీఆర్‌ఎస్‌ విషయంలోనూ కోహ్లీ కీలకంగా వ్యవహరించాడు. ఈసారి కూడా చాహల్‌ వేసిన 22వ ఓవర్‌లో బ్రూక్స్‌ (12) ఆడిన ఓ బంతి బ్యాట్‌ అంచును తాకుతూ వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. అయితే, టీమ్‌ఇండియా ఔట్‌ కోసం అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌటిచ్చాడు. అప్పుడే కోహ్లీ.. రోహిత్‌ వద్దకెళ్లి.. ఆ బంతి బ్యాట్‌కు తాకిందని డీఆర్‌ఎస్‌కు వెళ్లమని చెప్పాడు. రివ్యూలో తీర్పు భారత్‌కు అనుకూలంగా రావడం విశేషం. దీంతో కోహ్లీ అభిమానులు సంబరపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని