T20 World Cup: హార్దిక్‌ ఫిట్‌.. ఆ విషయం ఇప్పుడే చెప్పలేను: కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన పోరుకు ముందు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌పై సారథి విరాట్‌...

Published : 31 Oct 2021 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన పోరుకు ముందు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌పై సారథి విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హార్దిక్‌ పాండ్య పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో స్వల్పంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై అనేక సందేహాలు తలెత్తాయి. అయితే పాండ్య ఫిట్‌నెస్‌పై నెలకొన్న అనుమానాలకు కోహ్లీ తెరదించాడు. హార్దిక్‌ పాండ్య భుజం నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఇప్పుడు చాలా బాగున్నాడని చెప్పాడు. అయితే ఆదివారం కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడో లేదో మాత్రం ధ్రువీకరించకపోవడం గమనార్హం. ఒకవేళ పాండ్య ఫిట్‌నెస్‌ సాధించకపోతే.. హార్దిక్‌ స్థానంలో శార్దూల్‌ను తీసుకునే అవకాశాలపైనా కోహ్లీ స్పష్టత ఇవ్వలేదు. అయితే జట్టు యాజమాన్యం ప్రణాళికల్లో మాత్రం శార్దూల్‌ ఠాకూర్‌ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్‌కు తుది జట్టులో పాండ్య ఉండకపోవచ్చేనే సంకేతాలను ఇచ్చినట్లుగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ వేయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ శార్దూల్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘మా  ప్రణాళికల్లో శార్దూల్‌ ఎప్పుడూ ఉంటాడు. అయితే శార్దూల్‌ పాత్ర ఏమిటి..? అతడు ఎక్కడ ఫిట్‌ అవుతాడనే విషయాలను ఇప్పుడే చెప్పలేను. అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతడు ఉండటం జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే’’ అని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్య వెన్నునొప్పి సమస్యకు గురైనప్పటి నుంచి బౌలింగ్‌ చేయనేలేదు. జట్టులో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే ఉన్నాడు. అయితే గత ఐపీఎల్‌, పాక్‌తో మ్యాచ్‌లో విఫలం కావడంతో శార్దూల్‌ను తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కివీస్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని