PV  Sindhu: గాల్లో తేలినట్టుందే..! ఈ ఆనందం మర్చిపోలేనిదంటున్న సింధు

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఆనందంలో ఉన్నానని తెలుగు తేజం, భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు తెలిపింది. మరికొన్ని రోజుల్లో సాధన మొదలు పెడతానని పేర్కొంది....

Updated : 04 Aug 2021 13:54 IST

దిల్లీ: వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఆనందంలో ఉన్నానని తెలుగు తేజం, భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు తెలిపింది. మరికొన్ని రోజుల్లో సాధన మొదలు పెడతానని పేర్కొంది. డిసెంబర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నానని వెల్లడించింది. దిల్లీలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడింది.

‘రెండు పతకాల ఆనందం ఇంకా ఉంది. ఈ సందర్భాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఈ విజయాన్ని జీవితాంతం మర్చిపోలేను. ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు గెలవడం గొప్ప విజయం. ఆటలో రాణించేందుకు ఇతరులకు ఇది ప్రేరణనిస్తుందనే అనుకుంటున్నా’ అని పీవీ సింధు తెలిపింది. తన  తర్వాత లక్ష్యాల గురించి ఆమె వివరించింది.

‘మున్ముందు చాలా అంతర్జాతీయ టోర్నీలు ఉన్నాయి. త్వరలోనే నేను సాధన మొదలు పెడతాను. అత్యుత్తమంగా ఆడాలన్నదే నా లక్ష్యం. స్పెయిన్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ జరగబోతోంది. అందులో మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నా. 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో కచ్చితంగా ఆడతా. దానికి ఇంకా సమయం ఉంది’ అని సింధు వెల్లడించింది.

‘నా నుంచి కొత్త నైపుణ్యాలు, కొత్త స్ట్రోక్స్‌ చూస్తారని గతంలో చెప్పాను. ఒలింపిక్స్‌లో వాటిని ప్రదర్శించినందుకు సంతోషంగా ఉంది. నా కోచ్‌ పార్క్‌కు ధన్యవాదాలు. టెక్నిక్‌పై మేమిద్దరం ఎంతగానో పనిచేశాం. కరోనా వల్ల ఫిట్‌నెస్‌ కొనసాగించడం కష్టంగా అనిపించింది. బయో బుడగలో ఉంటూనే అప్రమత్తంగా ఉండాల్సి రావడంతో మానసికంగా బలంగా ఉండాల్సి వచ్చింది. చివరి ఐదేళ్లు బాగా గడిచాయి. ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఎన్నో నేర్చుకున్నాను. ఎంతో అనుభవం వచ్చింది. గత ఒలింపిక్స్‌కు అంచనాల్లేకుండా వెళ్లాను. ఈ సారి అంచనాల ఒత్తిడి ఎదుర్కొన్నా’ అని సింధు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు