IND vs PAK: మీ అంకుల్‌ అబ్బాయి అడిగాడని ఆ జెర్సీ తీసుకొంటే బాగుండేది: బాబర్‌పై వసీమ్‌ వ్యంగ్యాస్త్రాలు

భారత్‌ చేతిలో పాక్‌ ఓడిపోవడంపై (IND vs PAK) ఆ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి మాజీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అదే క్రమంలో పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ తీరుపై వసీమ్‌ అక్రమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Updated : 15 Oct 2023 13:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) పాకిస్థాన్‌పై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. తమ జట్టు కనీసం పోరాడకుండానే చేతులెత్తేయడంపై పాక్‌ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పాక్‌ మాజీ పేసర్ వసీమ్‌ అక్రమ్‌ (Wasim Akram) కెప్టెన్ బాబర్ అజామ్‌ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ నుంచి బాబర్‌ జెర్సీలను (Babar Azam) తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు. దానికి ఇది తగిన సమయం కాదని పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ అక్రమ్‌ అసహనం వ్యక్తం చేశాడు.

‘‘విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి సమయంలో బాబర్ జెర్సీలను పబ్లిక్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. డ్రెస్సింగ్‌ రూమ్‌ వద్ద తీసుకుంటే బాగుండేదేమో. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానో కూడా చెబుతా. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫొటోలను చూసినప్పుడు కామెంట్ చేయాల్సి వచ్చింది. మ్యాచ్‌ అనంతరం అలా చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ మీ అంకుల్‌ వాళ్ల అబ్బాయి కోహ్లీ జెర్సీని అడిగితే.. ఆట అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌ వద్ద ప్రైవేట్‌గానే ఆ జెర్సీలను తీసుకోవాల్సింది’’  అని వసీమ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

ఇదేం ఆట..? కనీసం పోరాడాల్సింది: రమీజ్ రజా

భారత్‌ చేతిలో (IND vs PAK) ఓటమిపై మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రజా (Ramiz Raja) తమ జట్టుపై అసహనం వ్యక్తం చేశాడు. మరో 20 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను చేజార్చుకోవడం తప్పకుండా వారిని తీవ్రంగా బాధించి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘విజయం సాధించలేనప్పుడు కనీసం పోరాడాలి. పాక్‌ జట్టు అదే చేయలేకపోయింది. తప్పకుండా వారిని ఇది తీవ్రంగా బాధిస్తుంది. మచ్చగా మిగిలిపోతుంది. మూడు విభాగాల్లోనూ భారత్‌ ఎదుట తేలిపోయారు. దీనిపై పాక్‌ జట్టు తీవ్రంగా శ్రమించాలి. పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోవం వల్లే ఓడిపోయామని చెప్పడం తగదు. ఈ మ్యాచ్‌లో మానసికంగా దెబ్బతినడమే కాకుండా నైపుణ్యపరంగానూ ఘోరంగా విఫలమయ్యారు’’ అని రమీజ్‌ రజా విమర్శించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని