Covid: కుటుంబమంతా ఛిన్నాభిన్నమైంది: మహిళా క్రికెటర్‌ వేద 

కొవిడ్‌-19 తమ జీవితాలను పూర్తిగా కుదిపేసిందని టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి తెలిపింది. తన తల్లి, సోదరి చనిపోవడంతో పూర్తిగా విషాదంలో మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

Published : 03 Jun 2021 01:34 IST

బెంగళూరు: కొవిడ్‌-19 తమ జీవితాలను పూర్తిగా కుదిపేసిందని టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి తెలిపింది. తన తల్లి, సోదరి చనిపోవడంతో పూర్తిగా విషాదంలో మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిస్థితి ఎంతో కీలకమని వెల్లడించింది. ఇప్పుడిప్పుడే ఆ బాధల నుంచి కోలుకుంటున్నానని వివరించింది.

వేద కృష్ణమూర్తి కుటుంబం బెంగళూరులో నివసిస్తోంది. ఆమెకు తప్ప కుటుంబంలో చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మందికి కొవిడ్‌ సోకింది. దాంతో వైద్యానికి సంబంధించిన ప్రతిదీ తనే చూసుకుంది. అయినప్పటికీ వేద తల్లి, సోదరి మృతిచెందడం అందరినీ కలచివేసింది.

‘విధి ఎలా ఉంటే అలా జరుగుతుందని నా నమ్మకం. కానీ మా అక్క ఇంటికి తిరిగొస్తుందనే అనుకున్నా. ఆమె కూడా చనిపోవడంతో నేను పూర్తిగా చితికిపోయా. మా కుటుంబమంతా ఛిన్నాభిన్నం అయింది. అప్పుడు నేనెంతో ధైర్యవంతురాలిలా ఉండాలనుకున్నాను. జీవితం ఎదురొడ్డిన ఆ పరీక్షా సమయంలో బాధల నుంచి బయట పడేందుకు ప్రయత్నించాను. కానీ ఆ బాధ మళ్లీ మళ్లీ వెంటాడింది’ అని వేద తెలిపింది.

‘ఆ సమయంలో నా ట్విటర్‌ ఫీడ్‌ చూస్తే ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు అర్థమైంది. కష్టాలు ఎదురైనప్పుడు మానసికంగా బలంగా ఉండటం అవసరం. కొవిడ్‌తో చనిపోవడానికి ముందు మా అక్క వత్సల భయంతో గుండెపోట్లు తెచ్చుకుంది. మా అమ్మ కూడా భయపడే ఉంటుంది. ఆమె చనిపోవడానికి ముందురోజు రాత్రి మా ఇంట్లో పిల్లలు సహా అందరికీ కొవిడ్‌ సోకిన విషయం తెలుసుకుంది. అది కూడా ఆమెపై ప్రభావం చూపించివుండవచ్చు’ అని వేద పేర్కొంది.

ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న చాలామందికి మానసిక ఆరోగ్యం గురించి తెలుసని వేద తెలిపింది. ఒకవేళ వ్యవస్థ నుంచి సహకారం రాకపోయినా మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించింది. తాను ఇబ్బందులు పడ్డప్పుడు అలా సాయం తీసుకున్నట్టు వెల్లడించింది. కష్ట సమయంలో ఫోన్‌ చేయని వాళ్ల గురించి తాను పట్టించుకోవడం లేదని తెలిపింది. తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేసింది. బీసీసీఐ కార్యదర్శి జే షా నుంచి ఫోన్‌కాల్‌ ఊహించలేదని, బెంగళూరుకు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని