Ravindra Jadeja : ఆ స్థానంలో ఆడటం అంత సులువేం కాదు: స్టీఫెన్ ఫ్లెమింగ్

టీ20 లీగ్‌లో చెన్నై ఏడో పరాజయం నమోదు చేసుకుంది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. బెంగళూరు నిర్దేశించిన ...

Published : 05 May 2022 10:29 IST

రవీంద్ర జడేజా ఫామ్‌పై స్పందించిన చెన్నై కోచ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో చెన్నై ఏడో పరాజయం నమోదు చేసింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 160/8 స్కోరుకే పరిమితమైంది. కీలక సమయంలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ తక్కువ పరుగులకే ఔటై పెవిలియన్‌కు చేరారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సారథ్య బాధ్యతలు భారంగా మారడంతోనే రాణించలేకపోతున్నాడని భావించినప్పటికీ.. ఆ కారణం సహేతుకంగా అనిపించడం లేదు. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత కూడానూ పెద్దగా ఆడిందేమీ లేదు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లను ఆడి 116 పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. ధాటిగా ఆడటంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో జడేజా ఫామ్‌పై చెన్నై కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్ స్పందించాడు.

‘‘టీ20ల్లో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. క్రీజ్‌లో కుదురుకోవడానికి తగినంత సమయం ఉండదు. ఆ ప్లేస్‌లో ఆడటం సులువైన విషయం కాదు. ఇదే జడేజా విషయంలో జరిగింది. కాబట్టే, అతడి ఫామ్‌పై మాకు ఆందోళన లేదు. ఇక రాబోయే మ్యాచుల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌పై దృష్టిపెట్టి ఫలితాలను రాబడతాం. ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచులోనూ విజయానికి చేరువగానే వచ్చాం. అన్ని విభాగాలు బాగానే రాణించాయి. అయితే ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే తప్పక గెలిచే వాళ్లం’’ అని ఫ్టెమింగ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని