FIFA: అబూబాకర్‌ను ఎందుకు పంపేశారు? రూల్స్‌ ఏం చెబుతున్నాయ్‌?

ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో బ్రజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో కామెరూన్‌ కెప్టెన్‌ అబూబాకర్‌ అద్భుతమైన గోల్‌ చేశాడు. కానీ, అతడిని రిఫరీ రెడ్‌ కార్డు ఇచ్చి బయటకు పంపేశాడు. ఎందుకో తెలుసా?అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Published : 05 Dec 2022 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిఫా (FIFA) ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు కామెరూన్‌ షాకిచ్చింది. మ్యాచ్‌ను 0-1తేడాతో కైవసం చేసుకుంది. 1998 తర్వాత గ్రూప్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న బ్రెజిల్‌ వేగానికి బ్రేక్‌ వేసింది. మ్యాచ్‌ చివర్లో అద్భుతమైన గోల్‌ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన కామెరూన్‌ కెప్టెన్‌ అబూబాకర్‌(Aboubakar)ను రిఫరీ గ్రౌండ్‌ నుంచి బయటకు పంపేశాడు. ఎందుకో తెలుసా? గోల్‌ చేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా టీషర్ట్‌ విప్పి అతడు సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడికి రిఫరీ తొలుత ఎల్లో కార్డు చూపించాడు. అయితే అప్పటికే ఎల్లో కార్డు ఎదుర్కొన్న అతడికి రెడ్‌ కార్డు ఇచ్చి బయటకు పంపాడు. 

రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

సాధారణంగా గేమ్‌ ఆడేటప్పడు ఆటగాళ్లు లోపల టీషర్ట్‌ ధరించి, దానిపై జెర్సీ వేసుకుంటారు. అయితే, టీ షర్ట్‌పై రకరకాల గుర్తులు వేసి, వాటిని రాజకీయ ప్రచారాలకు వాడుకుంటున్నారన్న వాదనలు వినిపించడంతో.. ఫిఫా చట్టంలో 2004లో సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు. గోల్ సాధించినప్పుడు సెలబ్రేట్‌ చేసుకునే హక్కు ప్రతి ఆటగాడికీ ఉంటుందని, అయితే, ఇది మితిమీరకూడదన్న ఉద్దేశంతోనే నిబంధనలను రూపొందించినట్లు ఫిఫా చట్టం చెబుతోంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే హక్కు రిఫరీకి ఉంటుంది. అయితే, ఎలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను హెచ్చరించవచ్చన్నదానిపైనా ఫిఫా చట్టం స్పష్టత ఇచ్చింది.

  • గోల్‌ విషయంలో రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, ఆయన్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా ఆటగాడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. రిఫరీకి బాధకలిగించేలా ఆటగాడే కొన్ని అభ్యంతరకరమైన సంజ్ఞలు చేసినా ఇది వర్తిస్తుంది.
  • గోల్‌ చేసిన ఆనందంలో ఆటగాడు.. గ్రౌండ్‌ చుట్టూ ఏర్పాటు చేసిన కంచెపైకి ఎక్కి సెలబ్రేట్‌ చేసినా క్రమశిక్షణను అతిక్రమించినట్టే.
  • మైదానంలో షర్టు తీసేసినా, లేదా షర్టును పైకెత్తి తలను కవర్‌ చేసినా అతడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లే పరిగణిస్తారు.
  • ఆటగాడు తన తల, ముఖం కనిపించకుండా ఏదైనా మాస్క్‌ ఉపయోగించినా అతడిని హెచ్చరించే హక్కు రిఫరీకి ఉంటుంది.
  • ఒకే గేమ్‌లో ఒక ఆటగాడు రెండుసార్లు ఎల్లో కార్డు ఎదుర్కొంటే దానిని రెడ్‌ కార్డుగా పరిగణించి అతడిని గ్రౌండ్‌ నుంచి బయటకు పంపిస్తారు. అంతేకాకుండా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుమతించరు. గేమ్ ఏ దశలో ఉన్నా.. మిగతా ఆటగాళ్లతోనే ఆ జట్టు ఆటను కొనసాగించాల్సి ఉంటుంది.
Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని