IND vs PAK in Asia Cup 2023: కేఎల్ రాహుల్ స్థానంలో సంజూ ఆడొచ్చా..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఆసియా కప్‌లో (Asia Cup 2023) తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. జట్టులో ఉన్న మరో ఏకైక వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌కు సదావకాశం లభించనుంది. అయితే, సీనియర్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ను తీసుకుంటే బాగుంటుందనే వాదనా లేకపోలేదు. కానీ, 17 మందితో కూడిన జట్టులో లేకపోవడం సంజూకు ఇబ్బందికరంగా మారింది.

Updated : 01 Sep 2023 12:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో (Asia Cup 2023) భాగంగా శనివారం భారత్ X పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య పోరు జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ అందుబాటులో ఉండడని ఇప్పటికే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? అని అభిమానుల మదిలో తలెత్తే ప్రశ్న. అయితే, వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ జట్టుతోపాటు ఉన్నాడు. తుది జట్టులోకి వచ్చే అవకాశం అతడికే ఎక్కువగా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో (IND vs PAK) సీనియర్‌ అయిన సంజూ శాంసన్‌ను ఆడిస్తే బాగుంటుందనేది ఫ్యాన్స్‌ అభిప్రాయం కాగా.. మరి నిబంధనలు ఏం చెబుతున్నాయనేది కీలకం. మరి సంజూను తీసుకోవచ్చా..? రూల్స్ ఎలా ఉన్నాయంటే? 

ఆసియా కప్‌లో దాయాదుల పోరు.. ఎవరిది జోరు?

ఆసియా కప్ కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్‌ లేడు. అతడిని స్టాండ్‌బై ప్లేయర్‌గానే రిజర్వ్‌ చేసి పెట్టారు. ఎవరైనా ప్లేయర్‌ టోర్నీ మొత్తానికి దూరమైతేనే అతడి స్థానంలోకి రిజర్వ్‌ ప్లేయర్‌ను తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే, కేఎల్ రాహుల్‌ తొలి రెండు మ్యాచ్‌లకే దూరంగా ఉంటాడని వెల్లడించిన నేపథ్యంలో.. స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న సంజూ శాంసన్‌కు తుది జట్టులోకి అవకాశం దక్కడం కష్టమేనని నిబంధనలు చెబుతున్నాయి. ఒక వేళ మ్యాచ్‌ జరిగే సమయానికి ముందే రాహుల్‌ టోర్నీకి దూరమవుతాడని వెల్లడిస్తే.. అప్పుడు సంజూ శాంసన్‌కు ఆడే అవకాశం లభిస్తుంది. దీంతో ఇప్పటికే స్క్వాడ్‌లో ఉన్న వికెట్‌ కీపర్‌ - బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ పాక్‌తో మ్యాచ్‌లో ఆడటం ఖాయం. 

కలవరపెడుతున్న వాతావరణం

దాయాదుల పోరుకు వరుణుడు అడ్డంకిగా మారేలా ఉన్నాడు. ఇవాళ వాతావరణం కాస్త పొడిగా అనిపించినా.. మ్యాచ్‌ జరగనున్న శనివారం మాత్రం వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఉదయం నుంచే మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని.. సాయంత్రం  5గంటల నుంచి తేలికపాటి చినుకులతో మొదలై వర్షం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మ్యాచ్‌ రద్దు అయితే భారత్ - పాకిస్థాన్‌కు చెరొక పాయింట్‌ లభిస్తుంది. అప్పుడు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌ నేరుగా సూపర్ - 4కు చేరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని