World Cup 2023: ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు.. రేసులో నలుగురు భారత ఆటగాళ్లు

2023 వన్డే ప్రపంచకప్‌నకుగానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్ అవార్డుకు పోటీ పడే ఆటగాళ్ల జాబితాను ఐసీసీ (ICC) విడుదల చేసింది. 

Published : 18 Nov 2023 17:17 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ (ODI World cUP 2023) తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగియనుంది. టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) తలపడనున్నాయి. ఇరుజట్లూ బలంగా ఉండటంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రతి ప్రపంచకప్‌లో ఒక ఆటగాడికి ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్ అవార్డు ఇస్తున్నారు. ఈ సారి ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్ అవార్డు రేసులో నిలిచిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. లిస్ట్‌లో మొత్తం తొమ్మిది ఆటగాళ్లు ఉండగా.. అందులో నలుగురు భారత ప్లేయర్లే కావడం విశేషం. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ అవార్డు రేసులో ఉన్నారు. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) కూడా పోటీలో ఉన్నారు. 

విరాట్ కోహ్లీ.. 711 పరుగులు 

కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో మొదటి నుంచి నిలకడగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 711 పరుగులు చేశాడు. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై శతకం చేసి వన్డేల్లో 50వ శతకాన్ని సాధించాడు. ఆస్ట్రేలియాపై 85, అఫ్గానిస్థాన్‌పై 55 నాటౌట్, బంగ్లాదేశ్‌పై 103 నాటౌట్, న్యూజిలాండ్‌పై 95, శ్రీలంకపై 88, సౌతాఫ్రికాపై 101, నెదర్లాండ్స్‌పై 51 పరుగులు చేసి సత్తాచాటాడు. ప్రస్తుతం కోహ్లీ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. 

ఆడమ్‌ జంపా.. 22 వికెట్లు

ఆసీస్‌ స్పిన్నర్ ఆడమ్ జంపా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగుసార్లు మూడు వికెట్ల ప్రదర్శన కనబర్చాడు.

క్వింటన్ డికాక్‌.. 594 పరుగులు 

తాజా ప్రపంచకప్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 10 మ్యాచ్‌లు ఆడి 594 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు బాది ఈ సారి అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌పై 15 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 174 పరుగులు చేశాడు.

మహ్మద్‌ షమి.. 23 వికెట్లు

భారత పేసర్ మహ్మద్ షమి ఆరు మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌పై 5/54, ఇంగ్లాండ్‌పై 4/22, శ్రీలంకపై 5/18 వికెట్లు తీశాడు.  సెమీ ఫైనల్‌లో కివీస్‌పై ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు.

రచిన్ రవీంద్ర.. 578 పరుగులు

కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 10 మ్యాచ్‌ల్లో 64.72 సగటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు.

మ్యాక్స్‌వెల్.. 398 పరుగులు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 66.33    సగటుతో 398 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే శతకం బాది వరల్డ్ కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక,  అఫ్గాన్‌పై వీరోచిత డబుల్‌ సెంచరీతో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (201*) ఆస్ట్రేలియాను సెమీస్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి.

రోహిత్ శర్మ.. 550 పరుగులు

ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ భారత్‌కు మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 550 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలున్నాయి.

బుమ్రా.. 18 వికెట్లు

టీమ్‌ఇండియా పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ భారత్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు.

డారిల్ మిచెల్.. 552 పరుగులు

న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఈ ప్రపంచకప్‌లో నిలకడగా ఆడాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 69 సగటుతో 552 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు బాదాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని