U19 Team India: కోహ్లీతో మాట్లాడాక మా ధైర్యం పెరిగింది: యశ్‌ ధుల్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీతో మాట్లాడాక తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ పేర్కొన్నాడు...

Updated : 05 Feb 2022 12:05 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీతో మాట్లాడాక తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ పేర్కొన్నాడు. శనివారం యువ భారత్‌.. ఇంగ్లాండ్‌తో తుదిపోరులో పోటీపడుతున్న నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడాడు. కీలక మ్యాచ్‌కు ముందు కోహ్లీ లాంటి మేటి ఆటగాడితో మాట్లాడటం తమకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కోహ్లీ మాటలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చాయని చెప్పాడు. తుదిపోరులో ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలా ఆడాలనే విషయాలను కూడా విరాట్‌ వివరించాడని పేర్కొన్నాడు.

తాము ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని.. సానుకూల ఆలోచనా ధోరణితో తుదిపోరులో తలపడతామని యువ సారథి చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ కూడా సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌తో పోరులో చివరి వరకూ పోరాడి గెలిచిందన్నాడు. దీంతో ఆ జట్టును కట్టడి చేయడానికి తమ ప్రాణాళికలకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నాడు. అలాగే తమ జట్టులోని ప్రతి ఒక్కరూ 100 శాతం రాణించడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. ఈ టోర్నీలో తమకు తగినంత అనుభవం దొరికిందని, దీంతో పెద్ద మ్యాచ్‌లకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలో తెలిసిందని కెప్టెన్‌ వివరించాడు. తుది పోరుకు ముందు తాము బలంగా మారామని, ఒత్తిడిని తట్టుకొని ఎలా రాణించాలో కూడా తెలిసిందని యశ్‌ ధూల్‌ ధీమా వ్యక్తం చేశాడు.

కాగా, ఈ యువ కెప్టెన్‌ ఆసీస్‌తో తలపడిన సెమీ ఫైనల్లో శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. 2008లో విరాట్‌ కోహ్లీ, 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ ఇలాగే సెంచరీలు బాది జట్టును విజేతగా నిలిపారు. ఇప్పుడు యశ్‌ ధూల్ సైతం అలాంటి ప్రదర్శనతోనే మరో అండర్‌-19 ప్రపంచకప్‌ తీసుకొస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని