IND vs ENG: అయ్యర్.. మంచి ఛాన్స్‌ను మిస్‌ చేసుకొన్నావు.. ఇక కష్టమే: జహీర్‌

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ వ్యాఖ్యానించాడు.

Updated : 05 Feb 2024 13:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జట్టులో కొనసాగించడం అవసరమా? అనే విమర్శల మధ్య వచ్చిన అవకాశాన్ని భారత క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) అందిపుచ్చుకోగా.. శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer) మాత్రం మిస్‌ చేసుకుని నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లాండ్‌తో (IND vs ENG) చివరి మూడు టెస్టులకు అతడిని ఎంపిక చేయడం కష్టమేనని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండోటెస్టులో శ్రేయస్ 29, 27 పరుగులు చేశాడు. శుభారంభాలను మరోసారి సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరిసారిగా 2022 డిసెంబర్‌లో శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను తాకాడు. దీనిపై భారత మాజీ పేసర్ జహీర్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఇప్పుడు ఫామ్‌ ఎంత కీలకమో శ్రేయస్‌ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జట్టుతోపాటు అతడికీ చాలా ముఖ్యం. ఇప్పటికే చాలాసార్లు మంచి అవకాశాలు వచ్చాయి. కేవలం ఒకే ఒక్క పేసర్‌ మాత్రమే ఇంగ్లాండ్‌ జట్టులో ఉన్నాడు. మిగతావారంతా స్పిన్నర్లే. ఇలాంటప్పుడు కాస్త కుదురుకుని పరుగులు రాబడితే బాగుండేది. చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పుడీ ప్రదర్శనతో.. అతడిని జట్టులో ఉంచాలా? వద్దా? అనే సందిగ్ధత లేకుండా సెలక్టర్లకు ఓ క్లారిటీ ఇచ్చినట్లు అనిపించింది. కేఎల్ రాహుల్‌ వచ్చే అవకాశాలున్నాయి. మరో యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ శతకం సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు’’ అని జహీర్‌ తెలిపాడు.

గిల్‌కు స్వల్ప గాయం..

ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో శుభ్‌మన్‌ గిల్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో నాలుగో రోజు మైదానంలోకి దిగలేదు. అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ అప్పుడే గిల్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. అయినా సరే, భారత రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో గిల్ ఆకట్టుకున్నాడు. గాయం తీవ్రతపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని