మర జీవులు

జీవం లేకపోతేనేం? అవి పక్షుల్లా ఎగురుతాయి. బొద్దింకల్లా పారాడతాయి. ఎలుకల్లా పరుగెడతాయి. చేపల్లా ఈదుతాయి. అదెలా అనుకుంటున్నారా? అవన్నీ బయో బోట్స్‌ మరి. అంటే జీవ రోబోలు అన్నమాట. అచ్చం జీవుల మాదిరిగా ప్రవర్తిస్తూ జీవుల గురించి లోతుగా తెలుసుకోవటానికి ఉపయోగపడే మర జీవులు. జీవజాలాల ప్రవర్తనలను, శక్తి యుక్తులను తెలుసుకోవటానికే కాదు.. విపత్కర పరిస్థితుల్లోనూ మనకు ఎంతగానో ఉపయోగపడగలవు. అలాంటి కొన్ని బయో బోట్స్‌ సంగతులు ఇవీ..

Updated : 13 Apr 2022 05:41 IST

జీవం లేకపోతేనేం? అవి పక్షుల్లా ఎగురుతాయి. బొద్దింకల్లా పారాడతాయి. ఎలుకల్లా పరుగెడతాయి. చేపల్లా ఈదుతాయి. అదెలా అనుకుంటున్నారా? అవన్నీ బయో బోట్స్‌ మరి. అంటే జీవ రోబోలు అన్నమాట. అచ్చం జీవుల మాదిరిగా ప్రవర్తిస్తూ జీవుల గురించి లోతుగా తెలుసుకోవటానికి ఉపయోగపడే మర జీవులు. జీవజాలాల ప్రవర్తనలను, శక్తి యుక్తులను తెలుసుకోవటానికే కాదు.. విపత్కర పరిస్థితుల్లోనూ మనకు ఎంతగానో ఉపయోగపడగలవు. అలాంటి కొన్ని బయో బోట్స్‌ సంగతులు ఇవీ..


గబ్బిలమై ఎగిరి

గబ్బిలం ఎగిరే తీరు చాలా సంక్లిష్టం. దీని రెక్కలు చాలా ప్రత్యేకం. గాలిలో ఎగురు తున్నప్పుడు వీటి ఆకారం అవసరానికి తగ్గట్టుగా మారుతుంది. అల్లాడిన ప్రతిసారీ వీటిల్లోని కండరాలు, ఎముకలు, కీళ్లు ఒక సమన్వయంతో కదులుతుంటాయి. మామూలుగా పక్షుల్లో రెక్కల నుంచి వెలువడే శక్తి ఈకల నుంచి పుట్టుకొస్తుంది. కానీ గబ్బిలంలో అలా కాదు. రెక్కల్లోని పలుచటి చర్మం నుంచి శక్తి పుట్టుకొస్తుంది. ఇది మృదువుగా, తేలికగా వంగేలా ఉంటూనే చాలా దృఢంగానూ ఉంటుంది. అందుకే గబ్బిలాల ఎగిరే సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి అమెరికా పరిశోధకులు బ్యాట్‌ బోట్‌ను రూపొందించారు. ముద్దుగా బీ2 అని పిలుచుకునే దీని రెక్కలను సిలికాన్‌ పదార్థంతో రూపొందించారు. కీళ్లు, ఎముకలను పోలిన మడతల వంటి ఆకారాల వల్ల ఇది అచ్చం గబ్బిలం రెక్కల మాదిరిగానే ముడుచుకుంటుంది. తెరచుకుంటుంది. అల్లాడినప్పుడల్లా దీనిలోకి గాలి నిండి, రూపం మారుతుంది. రెక్కలు కిందికి వచ్చినప్పుడు పూర్వస్థితికి చేరుకొని, గాలిని ఒక్క ఉదుటున బయటకు వెదజల్లుతుంది. అప్పుడు శక్తి ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. దీని మూలంగా అతి వేగంతో దూసుకుపోతుంది. నాలుగు రోటార్లతో కూడిన డ్రోన్ల వంటివి వెళ్లలేని చోట్లలోనూ బ్యాట్‌ బోట్‌ దేనికీ ఢీకొట్టకుండా సాఫీగా సాగుతుంది.


ఎలుకల్లో ఎలుకై

మనుషుల్లో తలెత్తే మానసిక సమస్యల గురించి మరింత లోతుగా తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు మనలాంటి మెదడు గల ఎలుకల వంటి జంతువుల మీద అధ్యయనాలు చేస్తుంటారు. ఇలాంటి జంతువులు మనుషుల్లో వచ్చే జబ్బులకు ప్రధాన ‘నమూనాలు’గా ఉపయోగపడుతుంటాయి. అయితే మానసిక జబ్బులతో ముడిపడిన సామాజిక ప్రభావాలను జంతువుల ద్వారా అంచనా వేయటం కష్టం. ఎందుకంటే మనుషుల వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు. సంబంధ బాంధవ్యాలూ వేరుగానే ఉంటాయి. వీటిని జంతు నమూనాలతో గుర్తించటమెలా? ఇక్కడే చైనా, జపాన్‌ పరిశోధకులు విభిన్నంగా ఆలోచించారు. డబ్ల్యూఆర్‌-5 అనే ఎలుక రోబోను సృష్టించారు. ఇది మర జీవే అయినా ముందు కాళ్లు, వెనక చక్రాల సాయంతో నిజం ఎలుక మాదిరిగానే కదులుతుంది. శరీరాన్ని మృదువుగా తాకటం, నిమరటం వంటి సంక్లిష్టమైన పనులనూ ఇది నిర్వహిస్తుండటం గమనార్హం. ఇలా జబ్బుతో బాధపడుతున్న ఎలుక దగ్గరకు మిగతా ఎలుకలు చేరుకునేలానూ చేసింది. అంటే ఒత్తిడికి గురైన ఎలుకల విషయంలో మిగతా ఎలుకల ప్రవర్తన మారేలానూ ప్రోత్సహించిందన్నమాట.


గోళ్లతో పక్షి పట్టు

పక్షులు అడవిలో ఎప్పుడంటే అప్పుడు ఎగురుతాయి. ఎక్కడంటే అక్కడ కొమ్మల మీద వాలి విశ్రాంతి తీసుకుంటాయి. ఈదురు గాలులు వీచినా పడిపోవు. ఇవి కాలి గోళ్లతో కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి మరి. ఇలాంటి సామర్థ్యం గల రోబోను తయారుచేస్తే పర్యావరణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయొచ్చు కదా. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఇంజినీర్‌ విలియమ్‌ రోడెరిక్‌కు ఇలాంటి ఆలోచనే వచ్చింది. వెంటనే పక్షి వంటి గోళ్లు గల రోబోను రూపొందించారు. ఇది కొమ్మ ఆకారం అస్తవ్యస్తంగా ఉన్నా కూడా గట్టిగా పట్టేసుకోగలదు. కార్చిచ్చుల వంటి ప్రమాదాలు వాటిల్లినప్పుడు అప్రమత్తం చేయటానికి, అడవి జంతువుల తీరుతెన్నులను పసిగట్టటానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


బొద్దింకలా గోడలెక్కి

జంతువుల మాదిరిగా కాళ్ల మీద పరుగెత్తే రోబోలంటే మొదట్నుంచీ ఆసక్తే. చక్రాలతో కూడిన వాటి కంటే కాళ్ల రోబోలు ఎక్కడికైనా సునాయాసంగా వెళ్లగలవు. రెండు, నాలుగే కాదు.. ఆరు కాళ్ల రోబోలనూ శాస్త్రవేత్తలు రూపొందించారు. బొద్దింకల స్ఫూర్తితో రూపొందించిన ఈ రోబో అలాంటిదే. దీనికి నాలుగు కాళ్లే ఉన్నా బొద్దింకల మాదిరిగా చుట్టుపక్కల వేగంగా పరుగెత్తగలదు. గోడలు ఎక్కగలదు. దీన్ని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. ఒకటిన్నర కిలోల బరువుండే దీని పొడవు 4.5 సెంటీమీటర్లు. దీని లోపలి భాగాలు జెట్‌ ఇంజిన్‌కు చెందినవి కావటం విశేషం. నిజానికి దీనికి నిధులు సమకూర్చింది రోల్స్‌ రాయిస్‌ సంస్థ. మనుషులు చేరుకోలేని చోటికి జెట్‌ ఇంజిన్లతో కూడిన చిన్న చిన్న నిఘా పరికరాలను పంపించే అవకాశాన్ని తెలుసుకోవాలన్నది దీని ఉద్దేశం. అందుకే పాదాల అడుగున జిగురు ప్యాడ్లతో గోడలు ఎక్కే బొద్దింకల వంటి కీటకాల మీద పరిశోధకులు దృష్టి సారించారు. గోడల వంటి ఉపరితలాల మీద కాలు మోపినప్పుడు వ్యతిరేక విద్యుదావేశాన్ని సృష్టించే ఎలక్ట్రోఅధెషన్‌ ప్రక్రియ ఆధారంగా ఈ రోబో పాదాలను రూపొందించారు. అందువల్ల ఇది నిటారుగా ఉన్న గోడలనూ తేలికగా, త్వరగా ఎక్కగలదు. ఇంత చిన్న కాళ్లతోనే ఈ పనులను సుసాధ్యం చేయటం చిన్న విషయమేమీ కాదు.


డేగలా దాడి

జంతువులకు సహజంగానే స్వార్థ గుణం ఉంటుందా? లేకపోతే అవి సమూహంగా తమను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాయా? ఇలాంటి సంక్లిష్టమైన జంతు ప్రవర్తనను గుర్తించటానికీ శాస్త్రవేత్తలు జీవ రోబోల వంకే చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫాల్కన్‌ రోబోను సృష్టించారు. స్వార్థ సిద్ధాంతమే నిజమైతే డేగల వంటివి దాడి చేసినప్పుడు పావురాలు గుంపు మధ్యలోకి వెళ్లటానికి పయత్నించాలి. ఇలా సమూహ రక్షణను ఉపయోగించుకొని తమను తాము కాపాడుకోవాలని చూడాలి. కానీ ఇది నిజం కాదని బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ పరిశోధకులు డేగ రోబో సాయంతో గుర్తించారు. ఇది దాడి చేసినప్పుడు పావురాలు గుంపు మధ్యలోకి వెళ్లకుండా ఒకదాని దగ్గరకు మరోటి అతుక్కున్నట్టు జరగటం విశేషం. సమూహంగా మొత్తం పావురాలన్నీ డేగ నుంచి పారిపోవటానికి ప్రయత్నించాయి. అంటే పరస్పర సహాయ ప్రవర్తనకే పావురాలు మొగ్గుచూపాయన్నమాట. సమూహంగా ఉంటేనే తమ మనుగడ సాధ్యమనే ధోరణి పరిణామక్రమంలో పావురాలకు అబ్బి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.


చేపలా కదిలి

విషయగ్రహణ నైపుణ్యాల విషయంలో చేపలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ పరస్పర సంబంధాల వంటి సంక్లిష్ట నైపుణ్యాల్లో ఇవేమీ తీసివేయదగ్గవి కావు. జర్మనీ పరిశోధకుల చేప రోబో పరిశోధన ఈ విషయాన్నే వెల్లడించింది. గుంపుగా ఉన్నప్పుడు చేపల సమష్టి ప్రవర్తనను తెలుసుకోవాలనేది దీని ఉద్దేశం. చిన్న తొట్టి అడుగున చక్రాలతో కూడిన రోబోకు 3డీ పద్ధతిలో ముద్రించిన గప్పీ చేపల నమూనాను అతికించారు. ఇది నిజం చేప మాదిరిగానే చుట్టుపక్కల చేపల వేగానికి అనుగుణంగా, వాటి వెనకాల తిరిగింది. గుంపుగా వేగంగా పోతున్నప్పుడు చేపలు మరింత సమన్వయంతో వ్యవహరిస్తూ జట్టు కడుతున్నట్టు గుర్తించింది. గుంపులో ఉన్నప్పుడు చేపలు తమ వేగాన్ని మార్చుకోవటమే కాదు.. సామాజిక ప్రతిస్పందనల విషయంలోనూ అతి చురుగ్గా స్పందిస్తున్నట్టు పరిశోధకులు తేల్చారు.


దూరం నుంచే..

చేపలు, కందిరీగల మధ్య స్నేహం కుదురుతుందా? మనకైతే తెలియదు. కానీ రోబోలు సాయం చేస్తే అవి ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే వీలుంది! విచ్రితంగా అనిపించినా రోబోలతో ఇలాంటి ప్రయోగమే చేశారు ఐరోపా విశ్వవిద్యాలయాల పరిశోధకులు. తేనెటీగ రోబో, చేప రోబోలను ‘మధ్యవర్తులు’గా వ్యవహరించేలా చేసి ఆస్ట్రియన్‌ తేనెటీగలను, స్విస్‌ జీబ్రాఫిష్‌లను ‘మాట్లాడుకునేలా’ చేశారు. చేప రోబో రంగులు, తోక కదలికలతో.. తేనెటీగ రోబో కంపనాలు, ఉష్ణోగ్రత మార్పుల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేశాయి. ఇలా తేనెటీగలు, చేపల కదలికలను సమన్వయం చేశాయి. అదీ ఇవి రెండూ 680 కిలోమీటర్ల దూరంలో ఉండగానే. బయోహైబ్రిడ్‌ వ్యవస్థతో ఇది సాధ్యమైంది. ఇక్కడ తేనెటీగల కదలికలను బట్టి అక్కడి చేపల కదలికలు, వేగం మారిపోవటం గమనార్హం.


పాములా మెలికలు

నింగి, నేల, ఆకాశం, సముద్రం.. ఇలా అన్నిచోట్లా రోబోలు బాగానే కదులుతాయి. కానీ భూగర్భంలో మాత్రం కష్టం. అలాగని శాస్త్రవేత్తలు ఊరుకోలేదు. మెత్తటి ఇసుక, నేలలోనూ రంధ్రాలు చేయగల పాములాంటి రోబోను సృష్టించారు. పాముల కదలికలు ప్రత్యేకం. అందుకే చాలాకాలంగా రోబోల తయారీలో వీటిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇసుక దిబ్బలు, సముద్రతీరాలు, పైపులు, పనిచేయని అణు విద్యుత్‌ కేంద్రాలు.. చివరికి మనిషి శరీరంలో కదిలే రోబోలనూ తయారుచేశారు. యూసీ సాంటా బార్బరా, జార్జియా టెక్‌ ఇంజినీర్లు మరో అడుగు ముందుకేసి భూగర్భంలోకి వెళ్లగలిగే రోబోను తయారుచేశారు. గొట్టం మాదిరిగా ఉండే దీని ముందు భాగాన గాలిని తోసే పరికరాలుంటాయి. ఇది ఇసుక, మట్టిని గాలితో తోస్తూ ఉంటే రోబో ముందుకు కదులుతూ వస్తుంది. ఇసుకలో రంధ్రాలు చేసే శాండ్‌ఫిష్‌ బల్లి స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. ఇది ఇసుక లోపల ఘర్షణను తగ్గించుకోవటానికి గాలిని కింది వైపునకు నెడుతుంది. దీంతో పొడిగా, రేణువులుగా ఉండే ఇసుకలోంచి తేలికగా పైకి రాగలుగుతుంది. పాములాగే మెలికలు తిరుగుతూ అడ్డంకులను తప్పించుకుంటుంది. ఇసుక లోపలికి చొచ్చుకెళ్తుంది. తిరిగి పైకి వస్తుంది. మట్టి నమూనాలు తీయటం.. నేలలో పైపులు, కేబుళ్లు అమర్చటం వంటి పనుల్లో ఇది సాయం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని