Updated : 06 Jan 2022 21:34 IST

CES 2022: అసుస్‌ ఫోల్డింగ్ ల్యాపీ.. శాంసంగ్‌ టీవీ.. ఇంకా!

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతి పెద్ద టెక్‌ పండుగ సీఈఎస్‌ 2022 (CES 2022)లో భవిష్యత్తు ఆవిష్కరణల ప్రదర్శన కొనసాగుతోంది. జనవరి 5 నుంచి 7 వరకు మూడ్రోజుల పాటు అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరుగుతున్న ఈవెంట్‌ రెండో రోజున సోనీ, బీఎండబ్ల్యూ, అమెకా, శాంసంగ్, అసుస్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించాయి. మరి ఆ ఉత్పత్తులేంటో చూద్దామా.. 


అసుస్‌ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌

అసుస్‌ కంపెనీ జెన్‌బుక్ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీ పేరుతో ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. ఇందులో ఫోల్డింగ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లే మూసినప్పుడు 12.5 అంగుళాలు, తెరిచినప్పుడు 17.3 అంగుళాలు ఉంటుంది. 12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 


అమెకా హ్యుమనాయిడ్ రోబోట్‌

బ్రిటన్‌కు చెందిన ఇంజనీర్‌డ్ ఆర్ట్స్‌ అనే కంపెనీ అమెకా (Ameca) పేరుతో హ్యుమనాయిడ్‌ రోబోను షోలో ప్రదర్శించింది. మనిషి తరహాలోనే ఈ రోబో ముఖకవళికలు మారుస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ రోబ్‌ను త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. 


న్యూరోసోనిక్ వేవ్‌ మ్యాట్రెస్‌

న్యూరోసోనిక్‌ కంపెనీ వేవ్‌ మ్యాట్రెస్‌ (Wave Matress) పేరుతో మసాజ్‌ బెడ్‌ను ఆవిష్కరించింది. దీనిపై పడుకున్నప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీతో వైబ్రేషన్స్ విడుదల చేస్తుంది. దానివల్ల బెడ్‌పై పడుకున్న వారికి మసాజ్ చేసినట్లు ఉంటుందని న్యూరోసోనిక్‌ చెబుతోంది. 


హ్యుండయ్‌ ఆటో బోట్‌ 

ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుండయ్‌ స్వయంచాలితంగా వెళ్లే బోటింగ్‌ టెక్నాలజీని ప్రదర్శించింది. దీనిద్వారా కార్ల తరహాలో చిన్నసైజు పడవల్లో కూడా ఆటో పైలట్ ఫీచర్‌ అందుబాటులోకి రానుందని ఆ సంస్థ తెలిపింది.  


బీఎండబ్ల్యూ రంగులు మార్చే కారు

ఈసారి ప్రదర్శనలో బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ ఫ్లో (BMW iX Flow) కారు వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. కారులోని బటన్‌ నొక్కగానే రంగులు మారే ఫీచర్‌ ఉంది. దీన్ని ఎలక్ట్రోఫోరెటిక్ సాంకేతికత సాయంతో తయారుచేశారు. 


రోబోటిక్ మసాజ్‌ టేబుల్

మసాజ్‌ రోబోటిక్స్ కంపెనీ రూపొందించిన రోబోటిక్ మసాజ్‌ టేబుల్ కూడా యూజర్స్‌ను ఆకట్టుకుంది. మనుషుల సాయం లేకుండా దీనిపై పడుకున్న వారికి చేతి ఆకారాన్ని పోలిన రోబో డివైజ్‌ మసాజ్‌ చేస్తుంది. 


సోనీ ఎలక్ట్రిక్ కారు 

సోనీ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్‌ కారును ఈ షోలో ప్రదర్శించింది. సోనీ విజన్‌-ఎస్‌ (Vision-S) పేరుతో తీసుకొచ్చిన ఈ కారును ప్రస్తుతం యూరోపియన్ రోడ్లపై పరీక్షిస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయి, అనుమతులు పొందిన తర్వాత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 


హైపర్‌ఎక్స్ గేమింగ్ హెడ్‌సెట్‌

గేమింగ్ ప్రియుల కోసం హైపర్‌ఎక్స్ (HyperX) కంపెనీ గేమింగ్ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. ఈ హెడ్‌సెట్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 300 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో ఇదే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన గేమింగ్ హెడ్‌సెట్‌. వైర్‌లెస్‌ గేమింగ్‌తోపాటు, క్లౌడ్‌ అల్ఫా వైర్‌లెస్‌, ఈ-స్పోర్ట్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. 


శాంసంగ్ కొత్త టీవీ

ఈ షోలో శాంసంగ్ కంపెనీ కొత్త మైక్రో ఎల్‌ఈడీ టీవీని విడుదల చేసింది. 89, 101, 110 అంగుళాల సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. అత్యుత్తమైన పిక్చర్‌, సౌండ్‌ క్వాలిటీ ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఆర్ట్‌, మల్టీ వ్యూ, డాల్బీ అట్‌మోస్ అనే మూడు మోడ్‌లు ఉంటాయి. దీనితోపాటు శాంసంగ్ నియో క్యూఎల్‌ఈడీ టీవీని కూడా పరిచయం చేసింది. 


దసాల్ట్‌ సిస్టమ్‌ లైట్ డిస్‌ప్లే

దసాల్ట్‌ కంపెనీ మానవ శరీర కదలికలను రికార్డ్ చేసి తెరపై ప్రదర్శించే మీట్‌ (Meet) అనే కొత్త సాంకేతికతను ప్రదర్శించింది. దీన్ని మనిషి వర్చువల్‌ ట్విన్‌గా కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీ సాయంతో హెల్త్‌కేర్ రంగంలో మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 


బిల్లాబోట్ డెలీవరి రోబోట్ 

PUDU అనే రోబోటిక్స్ కంపెనీ బిల్లాబోట్‌ అనే డెలివరీ రోబోట్‌ను  ప్రదర్శించింది. ఇది ఆస్పత్రులు, హోటల్స్ వంటి వాటితోపాటు ఇతర ప్రదేశాల్లో మనుషుల ప్రమేయం లేకుండా సేవలందిస్తుందని కంపెనీ చెబుతోంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని